ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్(41) రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. మెక్సికన్‌కు చెందిన మోడల్ గ్రేసియా మునోజ్‌ను దీపిందర్ పెళ్లి చేసుకున్నారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ వివాహం జరిగి మాత్రం నెలవుతుందని సమాచారం. తాజాగా గోయల్, గ్రేసియో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో విషయం ఆరా తీశారు. దాంతో ఇద్దరికీ వివాహం జరిగినట్లు తెలిసింది.
మునోజ్ ఇన్‌స్టాగ్రామ్ వివరాల ప్రకారం.. ఆమె మెక్సికోలో జన్మించారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్నారు. గతంలో మోడలింగ్ చేసిన ఆమె.. ఇప్పుడు సొంతంగా లగ్జరీ కన్జూమర్‌ప్రొడక్ట్‌లకు సంబంధించి ఒక స్టార్టప్ నడుపుతున్నారు. 2022 ఏడాదికిగాను మెట్రోపాలిటన్ ఫ్యాషన్‌వీక్ విజేతగా నిలిచారు. దీపిందర్‌కు ఇది రెండో పెళ్లి. ఆయన ఐఐటీ దిల్లీలో చదువుతున్నపుడు కంచన్ జోషితో పరిచయం ఏర్పడింది. దాంతో ఇరువురు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కంచన్ దిల్లీ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
దీపిందర్.. 2008లో హరియాణాలోని గురుగ్రామ్ కేంద్రంగా జొమాటో సంస్థను స్థాపించారు. కన్సల్టింగ్ సంస్థలో ఉద్యోగాన్ని వదిలి.. ఆహార డెలివరీ యాప్ ప్రారంభించారు. దేశంలో వెయ్యికి పైగా నగరాల్లోకి దీని కార్యకలాపాలు విస్తరించాయి. సుమారు రూ.1.5లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ కలిగిన జొమాటో ఇటీవల శాకాహారుల కోసం ప్రత్యేక సేవలు ప్రారంభించి వివాదంలోకి వెళ్లింది.
ఇదీ చదవండి: మొదటి విద్యుత్‌కారును ఆవిష్కరించిన ఫేమస్ కంపెనీ
‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ పేరుతో కొత్త సేవలు మొదలుపెట్టింది. అయితే ఆ ఫ్లీట్‌లో డెలివరీ స్టాఫ్‌కు ప్రత్యేకంగా గ్రీన్‌కలర్ డ్రెస్‌కోడ్ ఉంటుందని ప్రకటించడంతో వివాదం చెలరేగింది. అలా ప్రకటన వెలువరించిన కాసేపటికే కంపెనీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై అందరూ ఎర్ర రంగు యూనిఫామ్‌ను ధరిస్తారని చెప్పింది. అయితే ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. వెజ్ ఆర్డర్లను అందించడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారని కంపెనీ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment