టిక్‌టాక్‌ను సొంతం చేసుకుంటాం: మైక్రోసాఫ్ట్‌ | Microsoft Confirms Plans To Buy TikTok in US From Bytedance | Sakshi
Sakshi News home page

సెప్టెంబరు 15 నాటికి మైక్రోసాఫ్ట్‌ చేతికి టిక్‌టాక్‌

Published Mon, Aug 3 2020 11:35 AM | Last Updated on Mon, Aug 3 2020 12:27 PM

Microsoft Confirms Plans To Buy TikTok in US From Bytedance - Sakshi

వాషింగ్టన్‌: చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్ అమెరికా హక్కులు సొంతం చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ధ్రువీకరించింది. సెప్టెంబరు 15, 2020 నాటికి టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డాన్స్‌తో ఒప్పందం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆదివారం స్పష్టం చేసింది. జాతీయ భద్రతా ప్రమాణాలు దృష్టిలో పెట్టుకుని, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఇండో-అమెరికన్‌ సత్య నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్‌ కంపెనీ తన బ్లాగ్‌లో కీలక విషయాలను వెల్లడించింది. టిక్‌టాక్‌ అమెరికా విభాగాన్ని కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ పంపిన ప్రతిపాదనలకు బైట్‌డ్యాన్స్‌ సానుకూలంగా స్పందించిందని, ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్లు పేర్కొంది.(‌చైనీస్‌ యాప్‌లపై చర్యలు: ‘తనొక అమెరికన్‌ తోలుబొమ్మ’‌‌) 

అదే విధంగా యూఎస్‌తో పాటు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో సైతం టిక్‌టాక్‌ నిర్వహణ బాధ్యతలు సొంతం చేసుకునే యోచనలో ఉన్నామని, ఇందుకు సంబంధించి ఇతర అమెరికా పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని కూడా తాము ఆహ్వానించనున్నట్లు తెలిపింది. ఈ ఒప్పందం వల్ల టిక్‌టాక్‌ అమెరికా యూజర్లకు ఎలాంటి భంగం వాటిల్లబోదని, ఎవరితోనూ తాము ఈ సమాచారం పంచుకోబోమని స్పష్టం చేసింది. ఒకవేళ ఇప్పటికే ఈ యాప్‌లో యూజర్ల వ్యక్తిగత డేటా ఇతర దేశాలకు చేరి ఉంటే అన్ని సర్వర్ల నుంచి దానిని డెలిట్‌ చేయిస్తామని హామీ ఇచ్చింది. ప్రపంచ స్థాయి అత్యుత్తమ స్థాయి భద్రతా ప్రమాణాలు పాటిస్తామని, యూజర్లు, ప్రభుత్వానికి పారదర్శకంగా అన్ని విషయాలు వెల్లడిస్తామని పేర్కొంది.

అంతేగాకుండా మైక్రోసాఫ్ట్‌ తాజా ఒప్పందంతో అమెరికా ఖజానాకు భారీ స్థాయిలో మేలు చేకూరనుందని తెలిపింది. కాగా చైనాతో వాణిజ్య, దౌత్యపరమైన విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్‌ డ్రాగన్‌ కంపెనీలపై నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టిక్‌టాక్‌పై సహా వివిధ చైనీస్‌ యాప్‌లపై నిషేధం విధించే యోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో టిక్‌టాక్‌ హక్కులను అమెరికా కంపెనీ(మైక్రోసాఫ్ట్‌) కొనుగోలు చేయడం తనకు ఆమోదయోగ్యం కాదని ఇది వరకే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ చైనీస్‌ కంపెనీతో బిలియన్‌ డాలర్ల మేర ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు సిద్ధమైనట్లు ప్రకటించడం గమనార్హం.(అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధిస్తా)

ఇప్పటికే భారీ జరిమానాలు
టిక్‌టాక్‌కు ఇప్పటికే అమెరికాలో గట్టి ఎదురుదెబ్బలు తగిలిన సంగతి తెలిసిందే. కాలిఫోర్నియాకు చెందిన మ్యూజికల్‌.ఎల్‌వై(Musical.ly)ఒప్పందం కుదుర్చుకున్న టిక్‌టాక్‌ జాతీయ చిన్నారుల భద్రతా చట్టాన్ని అతిక్రమించిందని ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్(ఎఫ్‌టీసీ) ఇదివరకే సంస్థకు 5.7 మిలియన్‌ డాలర్ల మేరు జరిమానా విధించింది. అదే విధంగా 2019 ఫిబ్రవరిలో ఎఫ్‌టీసీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని(కన్సెంట్‌ డిక్రీ) టిక్‌టాక్‌ ఉల్లంఘించిందని పలు అమెరికా అడ్వకసీ గ్రూపులు టిక్‌టాక్‌పై ఫిర్యాదు చేశాయి. అంతేగాక తమ పాటలను యథేచ్చగా వాడుకుంటూ కాపీరైట్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు పలు టాప్‌ అమెరికన్‌ మ్యూజిక్‌ కంపెనీలు టిక్‌టాక్‌పై దావా వేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వెలువడ్డాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement