ఈ నెల 25 నుంచీ చేపట్టనున్న రైట్స్ ఇష్యూకి ధరను ప్రకటించడంతో ఆటో విడిభాగాల కంపెనీ మిండా ఇండస్ట్రీస్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క రెండు మూడు త్రైమాసికాలలో రికవరీ బాటనున్నట్లు బ్రోకింగ్ సంస్థలు అంచనా వేస్తుండటంతో ఆతిథ్య రంగ కంపెనీ లెమన్ ట్రీ హోటల్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..
మిండా ఇండస్ట్రీస్
ఒక్కో షేరుకి రూ. 250 ధలో రైట్స్ ఇష్యూని చేపట్టేందుకు బోర్డు అనుమతించినట్లు మిండా ఇండస్ట్రీస్ తాజాగా వెల్లడించింది. ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్న రైట్స్ ఇష్యూ సెప్టెంబర్ 8న ముగియనుంది. ఇప్పటికే 1:27 నిష్పత్తిలో రైట్స్ జారీకి బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. అంటే వాటాదారుల వద్దగల ప్రతీ 27 షేర్లకుగాను 1 షేరుని కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. ఇందుకు ఈ నెల 17.. రికార్డ్ డేట్‌కాగా.. తద్వారా రూ. 250 కోట్లు సమకూర్చుకోవాలని కంపెనీ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో మిండా ఇండస్ట్రీస్ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 7 శాతం దూసుకెళ్లి రూ. 301 వద్ద ట్రేడవుతోంది.
లెమన్ ట్రీ హోటల్స్
కోవిడ్-19 కారణంగా డీలాపడిన ఆతిథ్య రంగం తిరిగి రెండు మూడు క్వార్టర్లలో రికవరీ బాట పట్టగలదని పలు బ్రోకింగ్ సంస్థలు భావిస్తున్నాయి. దీంతో వరుసగా మూడో రోజు లెమన్ ట్రీ హోటల్స్ కౌంటర్ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 8.2 శాతం జంప్‌చేసి రూ. 29 వద్ద ట్రేడవుతోంది. ఇప్పటికే హోటల్ రంగంలో రికవరీ సంకేతాలు కనిపిస్తున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడగా.. కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్, ఐసీఐసీఐ డైరెక్ట్ సైతం ఇదే అభిప్రాయాలను వ్యక్తం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment