Lemon Tree Hotels
-
లెమన్‌ట్రీ హోటల్ ఘటన: షాకింగ్ అంశాలు వెల్లడి
సాక్షి, గచ్చిబౌలి, బొంరాస్‌పేట: హైదరాబాద్‌లోని మాదాపూర్ లెమన్‌ట్రీ హోటల్లో జరిగిన హత్య, ఆత్మహత్యల ఘటనలో పలు అంశాలు బయటికి వచ్చాయి. చాలా రోజులుగా ప్రేమించుకుంటున్న రాములు, సంతోషి.. నెలన్నర కిందటే రహస్యంగా ప్రేమ వివాహం చేసుకున్నారని, కానీ ఈ విషయాన్ని కుటుంబాలకు తెలిపే అంశంగా గొడవ పడ్డారని తెలిసింది. ఈ క్రమంలో ఆమెను చంపేసి, తాను ఆత్మహత్య చేసుకోవాలని రాములు ముందే నిర్ణయించుకున్నాడని.. స్టార్ హోటల్‌కు తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడని సమాచారం. చిన్ననాటి స్నేహం నుంచి.. మాదాపూర్‌లోని లెమన్‌ట్రీ హోటల్లో గురువారం సాయంత్రం యువతి హత్య, యువకుడి ఆత్మహత్య ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నారాయణపేట జిల్లా హకీంపేటకు చెందిన జి.రాములు (25), వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం లగచర్లకు చెందిన ఈడిగి సంతోషి (25) ఇద్దరూ హకీంపేటలోని జెడ్పీ హైస్కూలులో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య నెలకొన్న స్నేహం తర్వాత ప్రేమగా మారింది. కులాలు వేర్వేరు కావడంతో ఇరు కుటుంబాల వారు పెళ్లికి అంగీకరించలేదు. ఈ విషయంగా చిన్న గొడవలు కూడా జరిగినట్టు తెలిసింది. దీనితో రాములు, సంతోషి విడిపోతామని తమ కుటుంబాలకు చెప్పారు. కానీ తరచూ కలుస్తూ వచ్చారు. నెలన్నర రోజుల కిందే ప్రేమ వివాహం చేసుకున్నా.. కుటుంబాలకు తెలియకుండా ఉంచారు. తాజాగా పెళ్లి విషయాన్ని తమ కుటుంబాలకు చెప్పే విషయమై ఇరువురి మధ్య మనస్పర్థలు వచ్చి గొడవకు దారితీసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రాములు ఆమెను చంపేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడని.. లెమన్‌ట్రీ హోటల్‌కు వెళ్లేప్పుడే బ్లేడ్‌ను తెచ్చుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. కాగా.. సంతోషి, రాములు మృతదేహలకు కుటుంబ సభ్యులు స్వగ్రామాలకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. -
ప్రేయసి గొంతుకోసి.. ప్రియుడి ఆత్మహత్య
హైదరాబాద్/ కోస్గి/బొంరాస్‌పేట: వారిద్దరివీ పక్కపక్క ఊర్లు.. చిన్నప్పటి నుంచీ కలిసి చదువుకున్నారు.. ఆమె ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతుండగా.. అతను రెండు కార్లు కొనుక్కుని ట్రావెల్స్ నడుపుతున్నాడు. లాక్డౌన్ సమయంలో సొంతూర్లకు వెళ్లినప్పుడు ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. కలిసి బతకాలనుకున్నారు. కానీ అంతలోనే ఆ యువకుడు ఆమెను హత్య చేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న లెమన్‌ట్రీ హోటల్లో ఈ దారుణ ఘటన జరిగింది. ఆ యువతి వికారాబాద్ జిల్లా బొంరాసుపేట మండలం లగచర్లకు సంతోషి (25) కాగా.. ఆ యువకుడు ఆ ఊరికి పక్కనే ఉన్న నారాయణపేట జిల్లా కోస్గి మండలం హకీంపేటకు చెందిన జి.రాములు (25). హత్య, ఆత్మహత్య దారుణాన్ని గుర్తించిన హోటల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు. లాక్డౌన్లో ఇంటికి వెళ్లి..: హకీంపేటకు కిష్టయ్య, మొగులమ్మల కుమారుడు రాములు (25). సొంతంగా రెండుకార్లు కొనుగోలు చేసి హెదరాబాద్లో ట్రావెల్స్ నడుపుతున్నాడు. లగచర్లకు చెందిన ఈడిగి బాలమణి, ఈశ్వరయ్య దంపతుల ఐదో సంతానం సంతోషి (25). ఆమె కానిస్టేబుల్ పోస్టులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పరీక్షలకు సిద్ధమవుతోంది. కొంతకాలం హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంది. కరోనా లాక్డౌన్ సమయంలో స్వగ్రామానికి వెళ్లిన రాములు, సంతోష ప్రేమలో పడ్డారు. అయితే బుధవారం మధ్యాహ్నం వారిద్దరూ మాదాపూర్‌లోని లెమన్‌ట్రీ హోటల్ మూడో అంతస్తులో ఉన్న 317 నంబర్ గదిలో దిగారు. బుకింగ్ ప్రకారం గురువారం మధ్యాహ్నం గది ఖాళీచేసి వెళ్లిపోవాలి. కానీ మరో రోజు ఉంటామంటూ గడువు పెంచారు. గురువారం సాయంత్రం వారిమధ్య గొడవ జరిగింది. అటువైపుగా వెళ్తున్న ఒక రూమ్‌బాయ్ ఈ ఘర్షణ శబ్ధాలు విని.. హోటల్లో మిగతా సిబ్బందికి చెప్పాడు. చాలాసేపు ఎలాంటి అలికిడీ రాకపోవడంతో హోటల్ సిబ్బంది మారుతాళంతో గది తలుపులు తెరిచి చూశారు. బాత్రూమ్లో సంతోషి మృతదేహాన్ని, ఫ్యాన్‌కు వేలాడుతున్న రాములు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్లేడుతో గొంతు కోసి.. హోటల్‌కు వెళ్లిన పోలీసులు బాత్రూంలో రక్తపు మడుగులో వివస్త్రగా పడి ఉన్న సంతోషి మృతదేహాన్ని.. అక్కడినుంచి బెడ్ వరకు రక్తంతో కూడిన పాదాల గుర్తులు, రక్తం చుక్కలను గుర్తించారు. గదిలో ఇద్దరి మధ్యా గొడవ జరిగినప్పుడు ఆవేశంతో విచక్షణ కోల్పోయిన రాములు బ్లేడుతో సంతోషి గొంతు కోశాడని.. తర్వాత ఆమె చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. క్లూస్‌టీం బాత్రూమ్లో హత్యకు వినియోగించిన బ్లేడ్‌ను, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకుంది. ఆ గదిలో సంతోషికి చెందిన వివిధ పోటీ పరీక్షల పుస్తకాలు, ఓ ప్రైవేట్ ఈఎన్టీ ఆస్పత్రికి సంబంధించిన ఫైల్, ఆధార్ కార్డులు లభించాయి. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనతో హకీంపేట, లగచర్ల గ్రామాల్లో విషాదం అలుముకుంది. కొన్నాళ్లుగా కలిసి ఉంటూనే.. సంతోషి, రాములు ఇద్దరూ గతంలోనే ప్రేమ వివాహం చేసుకున్నారని.. కొంతకాలం హైదరాబాద్‌లో కలిసి ఉన్నారని హకీంపేట, లగచర్ల గ్రామాలకు చెందిన స్థానికులు తెలిపారు. ఇరు కుటుంబాల వారు అభ్యంతర పెట్టడంతో విడిగా ఉంటున్నారని తెలిపారు. కొన్నాళ్లుగా వారు సొంతూర్లలోనే ఉంటున్నారని.. కలిసి బతుకుదామని ఇటీవలే నిర్ణయించుకుని హైదరాబాద్‌కు వచ్చారని పేర్కొన్నారు. ఇంతలో ఏదైనా గొడవ జరిగి, ఈ దారుణానికి కారణమై ఉంటుందని తెలిపారు. -
మిండా రైట్స్ @250- లెమన్ ట్రీ జోరు
ఈ నెల 25 నుంచీ చేపట్టనున్న రైట్స్ ఇష్యూకి ధరను ప్రకటించడంతో ఆటో విడిభాగాల కంపెనీ మిండా ఇండస్ట్రీస్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క రెండు మూడు త్రైమాసికాలలో రికవరీ బాటనున్నట్లు బ్రోకింగ్ సంస్థలు అంచనా వేస్తుండటంతో ఆతిథ్య రంగ కంపెనీ లెమన్ ట్రీ హోటల్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. మిండా ఇండస్ట్రీస్ ఒక్కో షేరుకి రూ. 250 ధలో రైట్స్ ఇష్యూని చేపట్టేందుకు బోర్డు అనుమతించినట్లు మిండా ఇండస్ట్రీస్ తాజాగా వెల్లడించింది. ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్న రైట్స్ ఇష్యూ సెప్టెంబర్ 8న ముగియనుంది. ఇప్పటికే 1:27 నిష్పత్తిలో రైట్స్ జారీకి బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. అంటే వాటాదారుల వద్దగల ప్రతీ 27 షేర్లకుగాను 1 షేరుని కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. ఇందుకు ఈ నెల 17.. రికార్డ్ డేట్‌కాగా.. తద్వారా రూ. 250 కోట్లు సమకూర్చుకోవాలని కంపెనీ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో మిండా ఇండస్ట్రీస్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7 శాతం దూసుకెళ్లి రూ. 301 వద్ద ట్రేడవుతోంది. లెమన్ ట్రీ హోటల్స్ కోవిడ్-19 కారణంగా డీలాపడిన ఆతిథ్య రంగం తిరిగి రెండు మూడు క్వార్టర్లలో రికవరీ బాట పట్టగలదని పలు బ్రోకింగ్ సంస్థలు భావిస్తున్నాయి. దీంతో వరుసగా మూడో రోజు లెమన్ ట్రీ హోటల్స్ కౌంటర్ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 8.2 శాతం జంప్‌చేసి రూ. 29 వద్ద ట్రేడవుతోంది. ఇప్పటికే హోటల్ రంగంలో రికవరీ సంకేతాలు కనిపిస్తున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడగా.. కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్, ఐసీఐసీఐ డైరెక్ట్ సైతం ఇదే అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. -
లెమన్ ట్రీ అప్- సుందరం ఫాజనర్స్ వీక్
ప్రపంచ మార్కెట్లు పతనంకావడంతో దేశీ స్టాక్ మార్కెట్లలో సైతం అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో మార్కెట్లు నష్టాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 323 పాయింట్లు కోల్పోయి 33,215కు చేరగా.. నిఫ్టీ 101 పాయింట్లు తక్కువగా 9,801 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఆతిథ్య రంగ మధ్యస్థాయి కంపెనీ లెమన్ ట్రీ హోటల్స్ కౌంటర్ జోరందుకోగా.. ఆటో విడిభాగాల కంపెనీ సుందరం ఫాజనర్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వివరాలు చూద్దాం.. లెమన్ ట్రీ హోటల్స్ గత 10 ట్రేడింగ్ సెషన్లుగా జోరు చూపుతున్న లెమన్ ట్రీ హోటల్స్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసింది. కొనేవాళ్లు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువై రూ. 29 వద్ద ఫ్రీజయ్యింది. మే 29న నమోదైన రూ. 18 ధర నుంచి ఈ షేరు 60 శాతం ర్యాలీ చేయడం విశేషం! కాగా.. WF రికనైసెన్స్ ఫండ్‌తోపాటు.. WF ఏషియన్ స్మాలర్ కంపెనీస్ ఫండ్ కంపెనీలో 1.13 శాతం ఈక్విటీకి సమానమైన 89.44 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు తాజాగా లెమన్ ట్రీ హోటల్స్ వెల్లడించింది. దీంతో లెమన్ ట్రీ హోటల్స్‌లో ఈ రెండు సంస్థల వాటా 4.55 శాతం నుంచి 5.68 శాతానికి ఎగసింది. సుందరం ఫాజనర్స్ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతో సుందరం ఫాజనర్స్ షేరు డీలాపడింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 3.2 శాతం క్షీణించి రూ. 308 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 300 వరకూ నీరసించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4లో కంపెనీ నికర లాభం 53 శాతం క్షీణించి రూ. 53.4 కోట్లకు పరిమితమైంది. నికర అమ్మకాలు సైతం 26 శాం తగ్గి రూ. 808 కోట్లను తాకాయి. పన్నుకుముందు లాభం 53 శాతం వెనకడుగుతో రూ. 70 కోట్లకు చేరింది. -
హోటల్లో క్వారంటైన్‌కు రూ.3,100 అద్దె
సాక్షి న్యూఢిల్లీ: విదేశాల నుంచి వచ్చేవారు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న మూడు హోటళ్లలో క్వారంటైన్ సదుపాయాలను ఖరీదు చెల్లించి పొందడానికి ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. లెమన్‌ట్రీ, రెడ్ ఫాక్స్, ఐబీఐఎస్ హోటళ్లలో 182 గదులను ఇందుకోసం అందుబాటులో ఉంచారు. ఆసుపత్రులలో లభించే క్వారంటైన్ సదుపాయాలు నచ్చనివారు ఈ హోటళ్లలో గదులను సెల్ఫ్ క్వారంటైన్ కోసం ఉపయోగించుకోవచ్చు. (జాగ్రత్త పడకపోతే.. వినాశనమే ) క్వారంటైన్ సేవలు ఇలా.. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఢిల్లీలోని హోటళ్లలో ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. ప్రభుత్వం హోటల్ యాజమాన్యాలతో ఈ విషయాన్ని చర్చించి వాటిని విదేశాల నుంచి వచ్చేవారికి క్వారంటైన్ కోసం ఉపయోగించాలనే ఆదేశం జారీ చేసింది. ఢిల్లీí ఎడెమిక డిసీజ్ కోవిడ్–19 నిబంధనలు 2020 కింద ప్రభుత్వం ఈ రూముల అద్దెకు, వాటి మెయింటెనెన్స్‌కు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. (జాగ్రత్త పడకపోతే.. వినాశనమే) ఐబీఐఎస్ హోటల్లో 92 గదులను, లెమన్‌ట్రీ ప్రీమియర్ హోటల్లో 54 గదులను, రెడ్‌ఫాక్స్ హోటల్లో 36 గదులను క్వారంటైన్ కోసం కేటాయించారు. ఈ క్వారంటైన్ గదుల్లో బస చేసేవారు రోజుకు రూ.3100 అద్దె చెల్లించవలసి ఉంటుంది. ఈ గదుల్లో బస చేసేవారికి ఉదయం అల్పాహారం, రెండు పూటలా భోజనం, టీ, కాఫీలతో పాటు రోజుకు రెండు బాటిళ్ల మినరల్ వాటర్‌ను అందజేస్తారు. భోజనాన్ని వారి గదులలోనే డిస్పోజబుల్ ప్లేట్లు/పాత్రలలో అందిస్తారు. వాడిన డిస్పోజబుల్ ప్లేట్లు/పాత్రలను బయోమెడికల్ వ్యర్థాల కింద ప్రొటోకాల్ ప్రకారం నిర్మూలిస్తారు. గదులలో వైఫై సదుపాయం, టీవీ ఉంటాయి. ఈ గదులలో వాడే లాండ్రీని మిగతా గదుల లాండ్రీతో కలపకుండా జాగ్రత్త వహిస్తారు. ఈ హోటళ్లలో బస చేసిన వారు నిర్దేశించిన పరిసరాలకు మాత్రమే పరిమితమై ఉండేలా భద్రతా సిబ్బంది చూస్తారు. గదులలో ఉండేవారి కదలికలను హోటల్ యాజమాన్యం సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూము నుంచి గమనిస్తుంది. -
మరో 23 నగరాలకు లెమన్ ట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆతిథ్య రంగంలో ఉన్న లెమన్ ట్రీ కొత్తగా 29 హోటళ్లను ఏర్పాటు చేస్తోంది. తద్వారా 23 నగరాల్లో తొలిసారిగా అడుగు పెడుతోంది. దీంతో సంస్థ సేవలందిస్తున్న నగరాల సంఖ్య 54కు చేరుకోనుంది. ఇప్పటికే లెమన్ ట్రీ దేశవ్యాప్తంగా 49 హోటళ్లను నిర్వహిస్తోంది. కొత్త ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.1,700 కోట్లు వెచ్చిస్తున్నట్టు సంస్థ ప్రెసిడెంట్ విక్రమ్‌జిత్ సింగ్ తెలిపారు. 2021 నాటికి సంస్థ గదుల సంఖ్య 4,907 నుంచి 8,152కు చేరుతుందన్నారు. సోమవారం ఇక్కడ బంజారాహిల్స్‌లో లెమన్ ట్రీ హోటల్ ను ప్రారంభించిన సందర్భంగా సీవోవో సుమంత్ జైడ్కా, సౌత్ డైరెక్టర్ నరోతమ్ సింగ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. టాప్‌లో హైదరాబాద్.. కొత్త హోటల్లో 85 గదులున్నాయి. తాజాగా ఆరంభించినదానితో కలిసి లెమన్ ట్రీ హోటళ్ల సంఖ్య హైదరాబాద్‌లో నాలుగుకు చేరింది. 663 గదులతో సంస్థకు హైదరాబాద్ నెంబర్–1 గమ్యస్థానంగా నిలుస్తోంది. మిడ్ ప్రైస్ సెగ్మెంట్లో భారత్‌లో తొలి స్థానాన్ని తాము కైవసం చేసుకున్నామని విక్రమ్‌జిత్ తెలిపారు. ‘వచ్చే అయిదేళ్లు హోటల్ గదులకు డిమాండ్‌లో 12.4%, సరఫరాలో 7.9% వృద్ధి ఉంటుంది. హోటళ్లకు డిమాండ్ ఉంటుంది కాబట్టి చార్జీలు పెరుగుతాయి’ అని చెప్పారాయన. కాగా, సంస్థలో 5,500 మంది పనిచేస్తున్నారు. వీరిలో అంగవికలురు, వితంతువులు, పేదవారు, నిరక్షరాస్యులు 21% మంది ఉన్నట్లు విక్రమ్‌జిత్ తెలియజేశారు. -
లెమన్ ట్రీ డెబ్యూ అదిరింది
సాక్షి, ముంబై: ఆతిథ్య రంగ సంస్థ లెమన్ ట్రీ హోటల్స్ మొట్టమొదటి ట్రేడింగ్‌లో అదరగొట్టింది. మొట్టమొదటి ట్రేడింగ్‌లోనే లాభాల మోతమోగించింది. లిస్టింగ్‌లో 10 శాతం ప్రీమియాన్ని సాధించిన లెమన్ ట్రీ హోటల్స్ స్టాక్ ట్రేడింగ్ ఆద్యంతం జోరుగా సాగింది. ఇష్యూ ధర రూ. 56కాగా ఆరంభంలోనే 10శాతం దూసుకెళ్లింది. అనంతరం దాదాపు 32శాతానికి పైగా ఎగిసింది. చివరికి 28 శాతం లాభంతో 73.90వద్ద ముగిసింది. గత నెలాఖరున ఐపీవోకి వచ్చిన కంపెనీ దాదాపు రూ. 1039 కోట్లను సమీకరించింది. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 311 కోట్లను సమీకరించింది. అయితే ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి అంతంత మాత్ర స్పందనే కనిపించింది. ఇష్యూకి 1.2 రెట్లు అధికంగా మాత్రమే బిడ్స్ దాఖలయ్యాయి. ఐపీవోలో భాగంగా లెమన్ ట్రీ 12.98 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 15.47 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల(క్విబ్) కోటా 3.88 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌కాగా.. సంపన్న వర్గాలు, రిటైల్ విభాగాల నుంచి నామమాత్రంగా 0.12 శాతమే దరఖాస్తులు లభించాయి. కాగా మిడ్ రేంజ్లో దేశీయంగా అతిపెద్ద సంస్థ అయిన లెమన్ ట్రీ హోటల్స్ 28 పట్టణాలలో 45 హోటళ్లను నిర్వహిస్తోంది. లెమన్ ట్రీ ప్రీమియం, లెమన్ ట్రీ, రెడ్ ఫాక్స్ బ్రాండ్లతో ప్రీమియం, మధ్యస్థాయి, ఎకానమీ విభాగాల్లో మొత్తంగా 4,700 రూములను ఆఫర్ చేస్తోంది. -
మూడేళ్లలో దేశవ్యాప్తంగా 55 హోటళ్లు
లెమన్ ట్రీ సీవోవో సుమంత్ హైదరాబాద్‌లో మూడో హోటల్ షురూ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆతిథ్య రంగంలో ఉన్న లెమన్ ట్రీ హోటల్స్ భారీగా విస్తరిస్తోంది. 2017-18 నాటికి హోటళ్ల సంఖ్యను 55కి చేర్చనుంది. తద్వారా 8,000 గదుల సామర్థ్యానికి చేరుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం సంస్థ లెమన్ ట్రీ ప్రీమియర్, లెమన్ ట్రీ హోటల్స్, రెడ్‌ఫాక్స్ బ్రాండ్లలో 26 హోటళ్లను నిర్వహిస్తోంది. వీటి సామర్థ్యం 3,100 గదులని లెమన్ ట్రీ సీవోవో సుమంత్ జైడ్కా గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. హైదరాబాద్‌లో లెమన్ ట్రీ మూడవ హోటల్‌ను 190 గదులతో రూ.70 కోట్లు వెచ్చించి గచ్చిబౌలిలో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ తర్వాత మూడు బ్రాండ్లు హైదరాబాద్‌లో ఉన్నాయని వివరించారు. 22 హోటళ్లను లెమన్ ట్రీ సొంతంగా నెలకొల్పిందని, మిగిలిన నాలుగు సంస్థ నిర్వహణలో ఉన్నాయని చెప్పారు. మూడేళ్లలో సొంతంగా ఏర్పాటు చేసే 2,200 గదులకుగాను రూ.1,000 కోట్లకుపైగా వ్యయం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఒక్కో గదికి రూ.40-60 లక్షలు పెట్టుబడి పెడుతున్నట్టు తెలిపారు. ఐపీవోకు వెళ్లే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు.