మూడేళ్లలో దేశవ్యాప్తంగా 55 హోటళ్లు
లెమన్ ట్రీ సీవోవో సుమంత్
హైదరాబాద్‌లో మూడో హోటల్ షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆతిథ్య రంగంలో ఉన్న లెమన్ ట్రీ హోటల్స్ భారీగా విస్తరిస్తోంది. 2017-18 నాటికి హోటళ్ల సంఖ్యను 55కి చేర్చనుంది. తద్వారా 8,000 గదుల సామర్థ్యానికి చేరుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం సంస్థ లెమన్ ట్రీ ప్రీమియర్, లెమన్ ట్రీ హోటల్స్, రెడ్‌ఫాక్స్ బ్రాండ్లలో 26 హోటళ్లను నిర్వహిస్తోంది. వీటి సామర్థ్యం 3,100 గదులని లెమన్ ట్రీ సీవోవో సుమంత్ జైడ్‌కా గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. హైదరాబాద్‌లో లెమన్ ట్రీ మూడవ హోటల్‌ను 190 గదులతో రూ.70 కోట్లు వెచ్చించి గచ్చిబౌలిలో ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ తర్వాత మూడు బ్రాండ్లు హైదరాబాద్‌లో ఉన్నాయని వివరించారు. 22 హోటళ్లను లెమన్ ట్రీ సొంతంగా నెలకొల్పిందని, మిగిలిన నాలుగు సంస్థ నిర్వహణలో ఉన్నాయని చెప్పారు. మూడేళ్లలో సొంతంగా ఏర్పాటు చేసే 2,200 గదులకుగాను రూ.1,000 కోట్లకుపైగా వ్యయం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఒక్కో గదికి రూ.40-60 లక్షలు పెట్టుబడి పెడుతున్నట్టు తెలిపారు. ఐపీవోకు వెళ్లే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు.