ప్రపంచ మార్కెట్లు పతనంకావడంతో దేశీ స్టాక్ మార్కెట్లలో సైతం అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో మార్కెట్లు నష్టాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 323 పాయింట్లు కోల్పోయి 33,215కు చేరగా.. నిఫ్టీ 101 పాయింట్లు తక్కువగా 9,801 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఆతిథ్య రంగ మధ్యస్థాయి కంపెనీ లెమన్ ట్రీ హోటల్స్ కౌంటర్ జోరందుకోగా.. ఆటో విడిభాగాల కంపెనీ సుందరం ఫాజనర్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వివరాలు చూద్దాం..
లెమన్ ట్రీ హోటల్స్
గత 10 ట్రేడింగ్ సెషన్లుగా జోరు చూపుతున్న లెమన్ ట్రీ హోటల్స్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసింది. కొనేవాళ్లు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువై రూ. 29 వద్ద ఫ్రీజయ్యింది. మే 29న నమోదైన రూ. 18 ధర నుంచి ఈ షేరు 60 శాతం ర్యాలీ చేయడం విశేషం! కాగా.. WF రికనైసెన్స్ ఫండ్‌తోపాటు.. WF ఏషియన్ స్మాలర్ కంపెనీస్ ఫండ్ కంపెనీలో 1.13 శాతం ఈక్విటీకి సమానమైన 89.44 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు తాజాగా లెమన్ ట్రీ హోటల్స్ వెల్లడించింది. దీంతో లెమన్ ట్రీ హోటల్స్‌లో ఈ రెండు సంస్థల వాటా 4.55 శాతం నుంచి 5.68 శాతానికి ఎగసింది.
సుందరం ఫాజనర్స్
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతో సుందరం ఫాజనర్స్ షేరు డీలాపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 3.2 శాతం క్షీణించి రూ. 308 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 300 వరకూ నీరసించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4లో కంపెనీ నికర లాభం 53 శాతం క్షీణించి రూ. 53.4 కోట్లకు పరిమితమైంది. నికర అమ్మకాలు సైతం 26 శాం తగ్గి రూ. 808 కోట్లను తాకాయి. పన్నుకుముందు లాభం 53 శాతం వెనకడుగుతో రూ. 70 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment