సోమవారం నుంచి మైండ్‌స్పేస్‌ రీట్‌ ఐపీవో | Mindspace office parks REIT IPO on 27th july | Sakshi
Sakshi News home page

సోమవారం నుంచి మైండ్‌స్పేస్‌ రీట్‌ ఐపీవో

Published Sat, Jul 25 2020 4:05 PM | Last Updated on Sat, Jul 25 2020 4:05 PM

Mindspace office parks REIT IPO on 27th july - Sakshi

కె.రహేజా గ్రూప్‌నకు చెందిన కంపెనీ మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ ఆర్‌ఈఐటీ(రీట్‌) పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 27న ప్రారంభమై 29న ముగియనుంది. ఇష్యూ ధర రూ. 274-275కాగా.. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 200 యూనిట్లకు బిడ్స్‌ దాఖలు చేయవలసి ఉంటుంది. యూనిట్లను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌చేయనుంది. ఇష్యూ ద్వారా రూ. 4,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా ఇప్పటికే మైండ్‌స్పేస్‌లో ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలు రూ. 3,500 కోట్ల విలువైన యూనిట్లను విక్రయానికి ఉంచగా.. మరో రూ. 1,000 కోట్ల విలువైన యూనిట్లను కంపెనీ తాజాగా జారీ చేయనుంది. 2019 మార్చిలో ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ తదుపరి వస్తున్న రెండో రీట్‌ ఇష్యూ ఇది. ఎంబసీ ఆఫీస్‌ రీట్‌ ద్వారా రూ. 4,750 కోట్లు సమీకరించిన విషయం విదితమే. 

75 శాతం
ఐపీవోలో భాగంగా సంస్థాగత ఇన్వెస్టర్లకు 75 శాతం(9.2 కోట్ల యూనిట్లు), సంపన్న వర్గాలు, రిటైలర్లకు మిగిలిన 25 శాతం(3.07 కోట్ల యూనిట్లు) చొప్పున విక్రయించనున్నట్లు ఆఫర్‌ డాక్యుమెంట్‌లో మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ తెలియజేసింది. కాగా.. వ్యూహాత్మక సంస్థలు, యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి తాజాగా రూ. 2,644 కోట్లు సమీకరించింది. ఒక్కో యూనిట్‌ను రూ. 275 ధరలో యూనిట్లను జారీ చేసింది. ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలలో సింగపూర్‌ సావరిన్‌ ఫండ్‌ జీఐసీ, ఫిడిలిటీ గ్రూప్‌, క్యాపిటల్‌ గ్రూప్‌ తదితరాలున్నాయి. దీంతో ఐపీవో యూనిట్లలో 58.74 శాతాన్ని విక్రయించినట్లయ్యింది. ఫలితంగా ఐపీవో ద్వారా మిగిలిన రూ. 1856 కోట్లు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. 

బ్యాక్‌గ్రౌండ్‌
మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ ఏర్పాటులో ప్రమోటర్లు రహేజా గ్రూప్‌తోపాటు పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌ సైతం ఇన్వెస్ట్‌ చేసింది. కాగా.. ఐపీవో నిధులను రుణ చెల్లింపులు, కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. సెబీ వద్ద రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ సంస్థగా రిజిస్టర్‌ అయిన మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌.. మొత్తం 295 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ ప్రాపర్టీలను కలిగి ఉంది. మరో 28 లక్షల చదరపు అడుగులను అభివృద్ధి చేస్తోంది. ముంబై, పుణే, చెన్నై, హైదరాబాద్‌లలో రియల్టీ ఆస్తులను నిర్వహిస్తోంది. కంపెనీ పోర్ట్‌ఫోలియో, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ విభాగాల మార్కెట్‌ విలువను 2020 మార్చికల్లా రూ. 23,675 కోట్లుగా మదింపు చేసినట్లు ప్రాస్పెక్టస్‌లో తెలియజేసింది. కంపెనీ ప్రధానంగా లీజుల(అద్దెలు) రూపంలో ఆదాయాన్ని పొందుతుంటుంది. యూనిట్‌ హొల్డర్లకు డివిడెండ్ల రూపంలో ఆదాయం లభిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement