రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడని అందరికీ తెలుసు. అయితే మిడిల్ ఈస్ట్‌లో తిరుగులేని బిజినెస్‌మ్యాన్.. ‘ఆఫ్ఘనిస్తాన్ అంబానీ’ అని పిలిచే మిర్వాయిస్ అజీజీ (Mirwais Azizi) గురించి చాలా మందికి తెలియదు. ఆయన నిర్వహిస్తున్న వ్యాపారాలు ఏంటీ.. వాటి విలువ ఎంత.. ఎందుకు ఆయన్ను ‘ఆఫ్ఘనిస్తాన్ అంబానీ’ (Mukesh Ambani of Afghanistan) అంటారు.. తదితర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
ఆఫ్ఘనిస్తాన్‌లో అత్యంత సంపన్నుడు
మిర్వాయిస్ అజీజీ ఆఫ్ఘనిస్తాన్‌లో అత్యంత సంపన్నుడు. ఆయన్ను తరచుగా 'ముఖేష్ అంబానీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్' అని పిలుస్తారు. దుబాయ్ నుంచి తన వ్యాపారాన్ని నిర్వహిస్తున్న మిర్వాయిస్ అజీజీ, అజీజీ గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడు, ఛైర్మన్. అజీజీ 1989లో వ్యాపారాన్ని ప్రారంభించారు. రియల్టీ, బ్యాంకింగ్, పెట్టుబడి, హాస్పిటాలిటీ రంగాల్లో ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ అతిపెద్ద వాణిజ్య బ్యాంకు అయిన అజీజీ బ్యాంకుకు మిర్వాయిస్ అజీజీ చైర్మన్‌గా ఉన్నారు. 2006లో 7.5 మిలియన్ డాలర్ల ఈక్విటీ మూలధనంతో ఈ బ్యాంకును స్థాపించారాయన. ఆ బ్యాంక్ ఈక్విటీ మూలధనం ఇప్పుడు 80 మిలియన్ డాలర్లు.
2018 మార్చిలో అజీజీ పేరు "అరేబియన్ బిజినెస్ 100 ఇన్‌స్పైరింగ్ లీడర్స్ ఇన్ ది మిడిల్ ఈస్ట్" జాబితాలో ఉంది. ఆసియా సెంటినెల్ ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌లో విక్రయించే 70 శాతం పెట్రోలియం ఉత్పత్తులను నిర్వహించేది అజీజీనే.
అజీజీ బ్యాంక్ అధినేత
మిర్వాయిస్ అజీజీ ఆఫ్ఘనిస్తాన్‌లోని లగ్‌మన్‌లో అజీజీ పష్టూన్‌ల కుటుంబంలో 1962లో జన్మించారు. కాబూల్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన 1988లో దుబాయ్ వెళ్లారు. 2006లో అజీజీ బ్యాంక్‌ని స్థాపించారు. 2007లో అజీజీ డెవలప్‌మెంట్స్‌ను ఏర్పాటు చేశారు. మిర్వాయిస్ అజీజీ బఖ్తర్ బ్యాంకు (ప్రస్తుతం ఇస్లామిక్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్)కు కూడా అధినేత. నివేదికల ప్రకారం.. అజీజీ డెవలప్‌మెంట్స్ ప్రస్తుతం దుబాయ్ అంతటా 45 బిలియన్ దిర్హమ్‌ల విలువైన 200 ప్రాజెక్ట్‌లను కలిగి ఉంది. అజీజీ పెట్రోలియం వ్యాపారం అజీజీ హొటాక్ గ్రూప్ పది దేశాలలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అజీజీ ఈ వ్యాపారాన్ని 80 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్రారంభించాడు.
అజీజీ భార్య పేరు పారిగుల్. ఈ దంపతులకు ఫర్హాద్ అజీజీ, ఫవాద్ అజీజీ, జవాద్ అజీజీతో సహా ఏడుగురు సంతానం ఉన్నారు. మిర్వాయిస్ అజీజీ నెట్‌వర్త్ గురించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేనప్పటికీ ఆయనకున్న వివిధ వ్యాపారాల విలువల ఆధారంగా ఆయన్ను బిలియనీర్‌గా భావిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment