
దేశంలోనే అగ్రగామి వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటైన రిలయన్స్ తాజాగా మరో ఘనత సాధించింది. గడిచిన ఐదేళ్ల కాలంలో ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్టర్లకు అత్యధిక లాభాలు అందించిన సంస్థగా రికార్డుకెక్కింది.
మోతీలాల్ ఓస్వాల్ నివేదిక
ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే మోతీలాల్ ఓస్వాల్ సంస్థ తాజాగా వార్షిక సంపద సృష్టి నివేదిక విడుదల చేసింది. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌తో పాటు ఇన్వెస్ట్ సర్వీసులను ఈ సంస్థ అందిస్తోంది. ఐదేళ్ల కాలాన్ని పరిగణలోకి తీసుకుని ఈక్విటీ మార్కెట్లలో కంపెనీల పెర్ఫార్మెన్సుల ఆధారంగా ఈ జాబితాను ఆ సంస్థ ప్రకటిస్తుంది.
రిలయన్స్ నంబర్ 1
మోతీలాల్ రిపోర్టులో ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూపు ప్రథమ స్థానంలో నిలిచింది. 2016 నుంచి 2021 వరకు ఈక్విటీ మార్కెట్‌లో ఈ సంస్థ షేర్లు గణనీయంగా పెరిగాయి. తద్వారా ఈ షేర్లలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల ఇంట ఏకంగా రూ. 9.7 లక్షల కోట్ల సంపద జమ అయ్యింది. అంతకు ముందు 2014-19 టైం పీరియడ్‌లో రూ.5.6 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది.
రెండో స్థానంలో టీసీఎస్
దేశ వ్యాపార దిగ్గజ సంస్థల్లో ఒకటైన టాటా గ్రూపు సైతం సంపద సృష్టిలో ఎప్పటిలాగే ముందు వరుసలోనే నిలిచింది. ఈ గ్రూపుకి చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ. 7.3 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రూ.5.2 లక్షల కోట్ల స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రూ.3.2 లక్షల కోట్లతో హిందూస్థాన్ యూనీలీవర్, రూ.3.3 లక్షల కోట్లతో ఇన్ఫోసిస్ సంస్థలు నిలిచాయి. బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ. కోటక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థలు టాప్‌టెన్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
టాప్ 100.. రూ. 71 లక్షల కోట్లు
మోతీలాల్ ఓస్వాల్ 26 యాన్వువల్ వెల్త్ క్రియేషన్ స్టడీలో ఇండియాలో టాప్ 100 సంస్థలు కలిసి రూ. 71 లక్షల కోట్ల సంపదను సృష్టించినట్టు మోతీలాల్ ఓస్వాల్ నివేదిక పేర్కొంది. 2016 నుంచి 2021 వరకు ఐదేళ్ల కాలాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నివేదిక సిద్ధం చేసింది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో సంపద సృష్టి జరగలేదని ఆ నివేదిక పేర్కొంది. అంతకు ముందు 2014-19 వ్యవధికి సంబంధించి రూ. 49 లక్షల కోట్ల సంపద మార్కెట్‌లోకి వచ్చి పడింది.
Comments
Please login to add a commentAdd a comment