బర్గర్‌కింగ్‌ పుష్‌- బెక్టర్స్‌ ఫుడ్‌ ఐపీవోకు రెడీ | Mrs Bectors food IPO to open on December 15th | Sakshi
Sakshi News home page

బర్గర్‌కింగ్‌ పుష్‌- బెక్టర్స్‌ ఫుడ్‌ ఐపీవోకు రెడీ

Published Mon, Dec 7 2020 4:49 PM | Last Updated on Mon, Dec 7 2020 5:01 PM

Mrs Bectors food IPO to open on December 15th - Sakshi

ముంబై, సాక్షి: ప్రీమియం బిస్కట్ల తయారీ కంపెనీ బెక్టర్స్‌ ఫుడ్‌ స్పెషాలిటీస్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. వచ్చే వారం ఐపీవో చేపట్టనున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల గ్లోబల్‌ దిగ్గజం బర్గర్‌ కింగ్‌ పబ్లిక్‌ ఇష్యూ ఏకంగా 157 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్సన్‌ సాధించిన నేపథ్యంలో బెక్టర్స్‌ ఫుడ్‌ సన్నాహాలు వేగవంతమైనట్లు తెలియజేశాయి. బర్గర్‌ కింగ్‌, మెక్‌డొనాల్డ్స్‌, కేఎఫ్‌సీ, పిజ్జా హట్‌ తదితర గ్లోబల్‌ ఫాస్ట్‌ఫుడ్‌ చైన్స్‌కు కంపెనీ బన్స్‌ సరఫరా చేస్తుండటం ప్రస్తావించదగ్గ అంశం! కంపెనీ బెక్టర్స్‌ క్రీమికా పేరుతో ప్రీమియం బిస్కట్లను తయారు చేస్తోంది. ఇంగ్లీష్‌ ఒవెన్‌ బ్రాండుతో బ్యాకరీ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. 

2018లోనూ.. 
పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి బెక్టర్స్‌ ఫుడ్‌ స్పెషాలిటీస్‌ త్వరితగతిన అనుమతులు సంపాదించింది. ఒక ప్రయివేట్‌ రంగ కంపెనీగా 29 రోజుల్లోనే గ్రీన్‌సిగ్నల్‌ సాధించినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఈ నెల 15కల్లా ఐపీవో ప్రారంభమయ్యే వీలున్నట్లు తెలియజేశాయి. లూధియానాకు చెందిన కంపెనీ ఇంతక్రితం 2018లోనూ పబ్లిక్‌ ఇష్యూ ప్రయత్నాలు చేసింది. సెబీ అనుమతించినప్పటికీ మార్కెట్‌ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకుంది. తాజా ఇష్యూలో భాగంగా సీఎక్స్‌ పార్టనర్స్‌, గేట్‌వే పార్టనర్స్‌ కంపెనీలో కొంతమేర వాటాను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా రూ. 550 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ కానున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.

దిగ్గజాలతో పోటీ
లిస్టెడ్‌ దిగ్గజాలు ఐటీసీ, బ్రిటానియాతోపాటు.. పార్లే ఇండియా, మోడర్న్‌, హార్వెస్ట్‌ గోల్డ్‌ కంపెనీలతో బెక్టర్స్‌ ఫుడ్‌ పోటీ పడుతోంది. గ్లోబల్‌ ఫాస్ట్‌ఫుడ్‌ చైన్స్‌కు భారీ స్థాయిలో బన్స్‌ సరఫరా చేయడంతోపాటు.. ఫ్రోజెన్‌ డఫ్‌ విభాగంలోకీ ప్రవేశించింది. తద్వారా ఈ విభాగంలో మార్కెట్‌ లీడర్‌గా ఉన్న బేకర్స్‌ సర్కిల్‌తో పోటీని ఎదుర్కొంటోంది. 2019 మార్చికల్లా బెక్టర్స్‌ ఫుడ్‌ ఆదాయం రూ. 762 కోట్లను తాకింది. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా బిస్కట్లు, బేకరీ ప్రొడక్టుల రిటైల్‌ మార్కెట్‌ విలువ 7 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 52,000 కోట్లు)గా అంచనా. గత ఐదేళ్లలో వార్షికంగా 9 శాతం వృద్ధిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్‌ విలువలో బిస్కట్లు, రస్కులు, వేఫర్స్‌, కేకులు 89 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. బన్నులు, పిజ్జా బేస్‌లు తదితరాల వాటా 11 శాతమని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement