Reliance: ఏడాది జీతం వదులుకున్న ముకేశ్‌ అంబానీ | Mukesh Ambani Did Not Take Any Salary in FY21 Amid Covid | Sakshi
Sakshi News home page

Reliance: ఏడాది జీతం వదులుకున్న ముకేశ్‌ అంబానీ

Published Thu, Jun 3 2021 8:25 PM | Last Updated on Thu, Jun 3 2021 8:28 PM

Mukesh Ambani Did Not Take Any Salary in FY21 Amid Covid - Sakshi

ముంబై: ఆసియా కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ గత ఏడాదికి గాను ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోలేదట. ఈ విషయాన్ని రిలయన్స్‌ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి అంబానీ వేతనం ‘సున్నా’ అని తెలిపింది.  కరోనా మహమ్మారి కారణంగా వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న నేపథ్యంలో తన వార్షిక వేతనాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటున్నట్లు అంబానీ గతేడాది జూన్‌లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

అంతకుముందు 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ముకేశ్‌ అంబానీ 15 కోట్ల రూపాయల వేతనం అందుకున్నారు. గత 12 ఏళ్లుగా ఆయన జీతంలో ఎలాంటి మార్పు లేదు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ హోదాలో 2008-09 నుంచి జీతం, భత్యాలు, కమిషన్‌ అన్నీ కలిపి ఏడాదికి 15 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. అయితే కరోనా నేపథ్యంలో గతేడాదికిగానూ ఆయన ఎలాంటి జీతం తీసుకోలేదని రిలయన్స్‌ వెల్లడించింది. 

కాగా.. అంబానీ బంధువులు, రిలయన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు నిఖిల్‌, హితాల్‌ మేస్వానీ వేతనాల్లో ఎలాంటి మార్పు లేదు. వీరు గతేడాదికి గానూ 24 కోట్ల రూపాయల జీతం అందుకున్నారు. అయితే ఇందులో 17.28 కోట్ల రూపాయలు కమిషన్‌ కిందే పొందారు. మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు పీఎంఎస్‌ ప్రసాద్‌, పవన్‌ కుమార్‌ కపిల్‌ రెండేళ్ల ఇన్సెంటివ్‌లు పొందడంతో వారి జీతాలు కాస్త పెరిగాయి.

2020-21లో ప్రసాద్‌ 11.99కోట్ల రూపాయల వార్షిక వేతనం అందుకోగా.. గత ఆర్థిక సంవత్సరంలో  ఆయన 11.05 కోట్ల రూపాయలు తీసుకున్నారు. కపిల్‌ జీతం రూ. 4.04కోట్ల నుంచి రూ. 4.24 కోట్లకు పెరిగింది. ఇక కంపెనీ బోర్డులో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న ముకేశ్‌ సతీమణి నీతా అంబానీ గత ఆర్థిక సంవత్సరానికి గానూ  8 లక్షల రూపాయల సిట్టింగ్‌ ఫీజు, 1.65 కోట్ల రూపాయలు కమిషన్‌ అందుకున్నారు.

చదవండి: కరోనా: రిలయన్స్‌ మరో సంచలన నిర్ణయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement