న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ దేశీ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిల్చారు. 2023 సంవత్సరానికి గాను భారత్‌లోని 100 మంది సంపన్నులతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన సంపద 92 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు గతేడాది అంబానీని కూడా దాటేసిన అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ ఈసారి 68 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిల్చారు.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల దెబ్బతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు కుదేలవడంతో ఆయన సంపద 82 బిలియన్ డాలర్ల మేర కరిగిపోవడం ఇందుకు కారణం. ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివ నాడార్ 29.3 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను విడగొట్టి, లిస్టింగ్ చేయడంతో పాటు తన ముగ్గురు సంతానానికి రిలయన్స్ బోర్డులో చోటు కల్పించడం ద్వారా ముకేశ్ అంబానీ వారసత్వ ప్రణాళికను పటిష్టంగా అమలు చేసినట్లు ఫోర్బ్స్ పేర్కొంది.
అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లకు భారత్ ఒక హాట్‌స్పాట్‌గా ఉంటోందని తెలిపింది. కుబేరుల సంపద మరింతగా పెరగడంతో, టాప్ 100 లిస్టులోకి చేరాలంటే కటాఫ్ మార్కు 2.3 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆసియా వెల్త్ ఎడిటర్ నాజ్‌నీన్ కర్మాలీ వివరించారు. భారత్‌లోని 100 మంది కుబేరుల మొత్తం సంపద ఈ ఏడాది 799 బిలియన్ డాలర్లుగా ఉంది.
వ్యక్తి ర్యాంకు సంపద (బి.డాలర్లలో)
ముకేశ్ అంబానీ 1 92
గౌతమ్ అదానీ 2 68
శివ నాడార్ 3 29.3
సావిత్రి జిందాల్ 4 24
రాధాకిషన్ దమానీ 5 23
సైరస్ పూనావాలా 6 20.7
హిందుజా కుటుంబం 7 20
దిలీప్ సంఘ్వి 8 19
కుమార బిర్లా 9 17.5
షాపూర్ మిస్త్రీ, కుటుంబం 10 16.9
తెలుగువారిలో
మురళి దివి 33 6.3
పి.పి. రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి 54 4.05
‘డాక్టర్ రెడ్డీస్’ కుటుంబం 75 3
ప్రతాప్ రెడ్డి 94 2.48
పీవీ రామ్‌ప్రసాద్‌రెడ్డి 98 2.35
Comments
Please login to add a commentAdd a comment