
న్యూఢిల్లీ: వచ్చే రెండు దశాబ్దాల్లో భారత్ టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. తలసరి ఆదాయం రెట్టింపవుతుందని పేర్కొన్నారు. ’ఫేస్‌బుక్ ఫ్యూయల్ ఫర్ ఇండియా 2020’ కార్యక్రమంలో భాగంగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జకర్‌బర్గ్‌తో వర్చువల్ సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. దేశీయంగా మొత్తం కుటుంబాల్లో 50 శాతం పైగా వాటా ఉండే మధ్యతరగతి కుటుంబాల సంఖ్య ఏడాదికి మూడు.. నాలుగు శాతం మేర వృద్ధి చెందుతుందని అంబానీ చెప్పారు. రాబోయే రోజుల్లో భారత్ ఆర్థికంగా, సామాజికంగా మరింత వేగంగా వృద్ధి చెందబోతోందని, ఫేస్‌బుక్, జియో సహా ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహిక వ్యాపారవేత్తలు, కంపెనీలు ఈ ప్రక్రియలో పాలుపంచుకునేందుకు ఇది బంగారంలాంటి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ‘‘వచ్చే రెండు దశాబ్దాల్లో టాప్ 3 ఎకానమీల్లో ఒకటిగా భారత్ ఎదుగుతుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. యువ జనాభా ఊతంతో ప్రీమియర్ డిజిటల్ సమాజంగా కూడా ఎదుగుతుంది. మా తలసరి ఆదాయం 1,800–2,000 డాలర్ల నుంచి 5,000 డాలర్లకు పెరుగుతుంది’’ అని అంబానీ పేర్కొన్నారు.
సంక్షోభానికి వెరవడం మా డీఎన్‌ఏలోనే లేదు..
కోవిడ్ సంక్షోభాన్ని భారత్ దృఢసంకల్పంతో, దీటుగా ఎదుర్కొందని అంబానీ చెప్పారు. ‘‘కోవిడ్–19 మహమ్మారి భారీ స్థాయిలో విరుచుకుపడటం.. మిగతా అందరిలాగే భారత్‌లో ప్రజల్నీ కలవరపర్చింది. అయితే, సంక్షోభాలకు వెరవడమన్నది బహుశా భారతీయుల డీఎన్‌ఏలో లేదేమో. అందుకే మేం దీన్ని దీటుగా ఎదుర్కొనగలిగాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతీ సంక్షోభం.. ఒక కొత్త అవకాశం కల్పిస్తుందని అంబానీ చెప్పారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో అత్యంత భారీ స్థాయిలో టీకాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందన్నారు.
డిజిటల్ ఊతం...
డిజిటల్ ఇండియా నినాదం ఊతంతో కనెక్టివిటీ పెరగడం వల్ల కరోనా వైరస్‌పరమైన పరిస్థితులను భారత్ దీటుగా ఎదుర్కొనగలిగిందని అంబానీ పేర్కొన్నారు. సంపద ఫలాలు అందరికీ సమానంగా అందేందుకు డిజిటైజేషన్ ప్రక్రియ తోడ్పడగలదన్నారు. ‘భారత్, భారతీయులకు, దేశీయంగా చిన్న వ్యాపార సంస్థలకు.. ఫేస్‌బుక్, జియో భాగస్వామ్యం ఎంతో ప్రయోజనం చేకూ ర్చనుంది. రాబోయే రోజుల్లో మన మాటల కన్నా చేతలే దీనికి నిదర్శనంగా ఉండబోతున్నాయి’ అని జకర్‌బర్గ్‌తో అంబానీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment