న్యూఢిల్లీ: ఖరీదైన నివాస గృహాల ధరల పెరుగుదలలో అంతర్జాతీయంగా ముంబై నగరం 6వ స్థానంలో నిలిచినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ తెలిపింది. 2023 సంవత్సరం మొదటి మూడు నెలల కాలానికి సంబంధించి ఈ సంస్థ ‘ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ క్యూ1, 2023’ను విడుదల చేసింది.
ఈ కాలంలో ముంబైలో ఖరీదైన ఇళ్ల ధరలు 5.5 శాతం పెరిగాయి. అలాగే, బెంగళూరు, న్యూఢిల్లీలోనూ సగటున ధరలు పెరిగాయి. ఖరీదైన ఇళ్ల ధరల పెరుగుదల పరంగా 2022 మొదటి త్రైమాసికం జాబితాలో ముంబై 38వ ర్యాంకులో ఉండగా, ఏడాది తిరిగేసరికి 6వ స్థానానికి చేరుకున్నట్టు నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో గతేడాది ఇదే కాలంలో 37వ ర్యాంకులో ఉన్న బెంగళూరు తాజా జాబితాలో 16కు, న్యూఢిల్లీ 39 నుంచి 22వ ర్యాంకుకు చేరుకున్నాయి.
‘‘ముంబైలో ప్రముఖ ప్రాంతాల్లో ఇళ్ల ధరలు 5.5 శాతం పెరగ్గా, బెంగళూరులో క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 3 శాతం పెరిగాయి. న్యూఢిల్లీలో ఈ పెరుగుదల 1.2 శాతంగా ఉంది’’అని నైట్‌ఫ్రాంక్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 46 పట్టణాల్లో ప్రముఖ ప్రాంతాల్లో ఇళ్ల ధరల పెరుగుదల ఆధారంగా వాటికి ర్యాంకులకు కేటాయిస్తుంటుంది. స్థానిక కరెన్సీలో సాధారణ ధరలను ప్రామాణికంగా తీసుకుంటుంది.
ముంబైలో ఇళ్లకు డిమాండ్ గణనీయంగా పెరగడమే సూచీలో మెరుగైన ర్యాంకుకు తీసుకెళ్లినట్టు నైట్ ఫ్రాంక్ పేర్కొంది. ముంబై ఇళ్ల మార్కెట్లో అన్ని విభాగాల్లోనూ డిమాండ్ బలంగానే ఉందని, ఖరీదైన ఇళ్ల ధరలు ఎక్కువగా పెరిగినట్టు తెలిపింది. అంతర్జాతీయంగా దుబాయిలో ఖరీదైన ఇళ్ల ధరలు 44.2 శాతం పెరగడంతో, ఈ నగరం మొదటి స్థానంలో నిలిచింది.
చదవండి👉 సొంతిల్లు కొంటున్నారా?, అదిరిపోయే ఈ కేంద్ర ప్రభుత్వ స్కీం గురించి తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment