మేలో ఈక్విటీ ఫండ్స్‌ హవా..! | Mutual fund buying and selling trends for May unveiled | Sakshi
Sakshi News home page

మేలో ఈక్విటీ ఫండ్స్‌ హవా..!

Published Sat, Jun 15 2024 6:19 AM | Last Updated on Sat, Jun 15 2024 12:44 PM

Mutual fund buying and selling trends for May unveiled

రూ. 34,697 కోట్ల పెట్టుబడులు 

సిప్‌ పెట్టుబడులకు ఇన్వెస్టర్ల క్యూ  

న్యూఢిల్లీ: గత నెలలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌(ఎంఎఫ్‌లు)కు ఇన్వెస్టర్లు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో సరికొత్త రికార్డ్‌ నెలకొల్పుతూ మే నెలలో రూ. 34,697 కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. 

ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 83 శాతం అధికంకాగా.. అప్పుడప్పుడూ మార్కెట్లో నమోదైన దిద్దుబాట్లు ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టేందుకు అవకాశాలను కలి్పంచాయి. ఇన్వెస్టర్లు ప్రధానంగా థిమాటిక్‌ ఫండ్స్‌పట్ల ఆకర్షితులైనట్లు దేశీ ఎంఎఫ్‌ అసోసియేషన్‌(యాంఫీ) పేర్కొంది. ఈ బాటలో క్రమబద్ధ పెట్టుబడి పథకాల(సిప్‌)కు సైతం రూ. 20,904 కోట్ల పెట్టుబడులు లభించినట్లు వెల్లడించింది. ఇది కూడా సరికొత్త రికార్డ్‌కావడం గమనార్హం! 

హెచ్చుతగ్గుల్లోనూ 
ఇటీవల మార్కెట్లలో ఆటుపోట్లు కొనసాగినప్పటికీ ఇన్వెస్టర్లు ఈక్విటీలపట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లు భారీ పెట్టుబడులు తెలియజేస్తున్నాయి. వెరసి ఈక్విటీ ఫండ్స్‌లోకి వరుసగా 39వ నెలలోనూ నికరంగా పెట్టుబడులు ప్రవేశించాయి. ఏప్రిల్‌లో సిప్‌ పెట్టుబడులు రూ. 20,371 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో వరుసగా రెండో నెలలోనూ సిప్‌లో రూ. 20,000 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి.

 ప్రధానంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు సిప్‌లో ఇన్వెస్ట్‌ చేసే సంగతి తెలిసిందే. ఇక మొత్తంగా ఎంఎఫ్‌ పరిశ్రమకు  మే నెలలో రూ. 1.1 లక్ష కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. ఏప్రిల్‌లో ఇవి రూ. 2.4 లక్షల కోట్లుకావడం గమనార్హం! ఫలితంగా ఎంఎఫ్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) ఏప్రిల్‌లో నమోదైన రూ. 57.26 లక్షల కోట్ల నుంచి మే చివరికల్లా రూ. 58.91 లక్షల కోట్లకు బలపడింది.  

స్మాల్‌ క్యాప్స్‌ జోరు 
చిన్న షేర్ల(స్మాల్‌ క్యాప్స్‌) విభాగం మే నెలలో 23 శాతం వృద్ధితో రూ. 2,724 కోట్ల పెట్టుబడులను అందుకుంది. అయితే లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌కు రూ. 663 కోట్లు మాత్రమే లభించాయి. అంటే ప్రత్యేకించిన, అధిక రిటర్నులు అందించే అవకాశాలకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీర్ఘకాలంగా మార్కెట్లలో అప్‌ట్రెండ్‌ కొనసాగుతుండటంతో మధ్యమధ్యలో వస్తున్న దిద్దుబాట్లను ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు అవకాశాలుగా వినియోగించుకుంటున్నట్లు మారి్నంగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ ఇండియా రీసెర్చ్‌ మేనేజర్‌ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు. 

కొటక్‌ మహీంద్రా ఏఎంసీ సేల్స్‌ నేషనల్‌ హెడ్‌ మనీష్‌ మెహతా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మళ్లీ ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదన్న అంచనాలు సైతం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టనుందన్న అంచనాలు మార్కెట్లలో మరింత ర్యాలీకి కారణమవుతుందన్న ఆలోచన కొనుగోళ్లకు దారి చూపుతున్నట్లు వివరించారు.

 దేశ ఆర్థిక వృద్ధిపట్ల విశ్వాసంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు క్యూ కడుతున్నట్లు ఫైయర్స్‌ వైస్‌ప్రెసిడెంట్‌ గోపాల్‌ కావలిరెడ్డి పేర్కొన్నారు. ఇక ఈక్విటీలుకాకుండా రుణ పథకాల విభాగంలోనూ రూ. 42,495 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడులపై ఆసక్తి చూపడం ప్రభావం చూపింది. అయితే ఏప్రిల్‌లో నమోదైన రూ. 1.9 లక్షల కోట్లతో పోలిస్తే పెట్టుబడులు 78 శాతం క్షీణించాయి. రుణ పథకాలలో లిక్విడ్‌ ఫండ్స్‌ అత్యధికంగా రూ. 25,873 కోట్లు ఆకట్టుకుని రికార్డ్‌ నెలకొల్పాయి.  ­­

ఈఎల్‌ఎస్‌ఎస్‌ మినహా 
ఈక్విటీ ఆధారిత ఎంఎఫ్‌లలో నికర పెట్టుబడులు రూ. 25 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించి రూ. 25.39 లక్షల కోట్లకు చేరాయి. ఇది చరిత్రాత్మక గరిష్టమని యాంఫీ సీఈవో వెంకట్‌ చలసాని తెలియజేశారు. ఫోకస్‌డ్, ఈక్విటీ లింక్‌డ్‌ పొదుపు పథకాలు(ఈఎల్‌ఎస్‌ఎస్‌) విభాగాలను మినహాయించి చూస్తే ఇతర విభాగాలకు నికరంగా పెట్టుబడులు తరలి వచి్చనట్లు పేర్కొన్నారు. సెక్టార్, థిమాటిక్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. దీంతో మే నెలలో రూ. 19,213 కోట్లు లభించాయి. ప్రధానంగా హెచ్‌డీఎఫ్‌సీ మ్యాన్యుఫాక్చరింగ్‌ ఫండ్‌ నుంచి వెలువడిన కొత్త ఆఫరింగ్‌(ఎన్‌ఎఫ్‌వో) రూ. 9,563 కోట్లు అందుకోవడం ఇందుకు సహకరించింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement