ముంబై: ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి సంబంధించి క్రిసిల్ రేటింగ్స్ సానుకూల అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) వాటి ఆస్తులు నాలుగేళ్ల గరిష్ట స్థాయి అయిన 11–12 శాతం మేర వృద్ధి చెందుతాయని అంచనా వేసింది. కరోనా కారణంగా వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల పాటు ఎన్‌బీఎఫ్‌సీ ఆస్తుల వృద్ధి కుంటుపడిందని, 2021–22లో కేవలం 5 శాతం వృద్ధికి పరిమితమైనట్టు వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటి ఆస్తులు రెండంకెల స్థాయిలో పెరగొచ్చని అంచనా వేస్తూ.. అయినప్పటికీ కరోనా ముందున్న 20 శాతం వృద్ధి కంటే తక్కువేనని పేర్కొంది. బ్యాంకుల నుంచి తీవ్ర పోటీ ఉండడం, వడ్డీ రేట్ల పెరుగుదల కొన్ని విభాగాల్లో ఎన్‌బీఎఫ్‌సీల పోటీతత్వాన్ని ప్రభావితం చేస్తాయని అంచనా వేసింది. దీనివల్ల ఎన్‌బీఎఫ్‌సీలు అధిక రాబడులు వచ్చే విభాగాలపై దృష్టి సారించొచ్చని పేర్కొంది.
వాహన రుణాల్లో మెరుగైన వృద్ధి..
ఎన్‌బీఎఫ్‌సీ ఆస్తుల్లో (అవి ఇచ్చిన రుణాలు) సగం మేర వాహన రుణాలే ఉంటాయి. ఇవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11-13 శాతం వరకు పెరుగుతాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. క్రితం రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ వాహన రుణాల్లో వృద్ధి 3–4 శాతంగానే ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. పునర్‌వినియోగ వాహన రుణాల్లో అధిక వృద్ధిని ఎన్‌బీఎఫ్‌సీలు చూస్తాయని, వీటిల్లో అధిక మార్జిన్లు ఉంటాయనే విషయాలను ప్రస్తావించింది. వాహన రుణాలు ఆశాజనకంగా ఉండడం, ఇన్‌ఫ్రా రంగం నుంచి వాహనాలను మార్చేందుకు బలమైన డిమాండ్ ఉంటుందని క్రిసిల్ తెలిపింది. తీవ్ర పోటీ, పెరిగే వడ్డీ రేట్ల వల్ల కొత్త వాహన రుణాల్లో బ్యాంకులు పైచేయి చూపించొచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment