న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ నెస్లే ఇండియా 2025 నాటికి భారత్‌లో రూ.4,200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. ఇందులో భా గంగా ఒడిశా రాష్ట్రంలో దేశంలోనే 10వ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ తెలిపారు. రానున్న రోజుల్లో భారత మార్కెట్లో తమ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. 2023 మొదటి ఆరు నెలల్లో తాము రూ. 2,100 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు తెలిపారు.
ఈ మొత్తంలో ఒకటో వంతు ఆహారోత్పత్తుల కోసమే వెచ్చించినట్టు పేర్కొన్నారు. చాక్లెట్లు, కన్ఫెక్షనరీ తయారీ కోసం ఒక వంతు, మిగిలిన మొత్తాన్ని న్యూట్రిషన్, ఇతర ఉత్పత్తుల తయారీపై ఖర్చు చేసినట్టు మీడియా సమావేశంలో ప్రకటించారు. మ్యాగీ నూడుల్స్, కిట్‌క్యాట్ చాక్లెట్లు, నెస్‌కేఫే తదితర పాపులర్ ఉత్పత్తులను ఈ సంస్థ విక్రయిస్తుండడం తెలిసిందే. 2023 నుంచి 2025 మధ్య మరో రూ.4,200 కోట్లు ఖర్చు చేస్తామని చెబుతూ, ఇందులో రూ.900 కోట్లతో ఒడిశాలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉన్నట్టు సురేష్ నారాయణన్ తెలిపారు. అలాగే, కాఫీ, బెవరేజెస్ కోసం నిధులు వెచి్చంచనున్నట్టు చెప్పారు. నెస్లే ఇండియా ఏర్పాటైన నాటి నుంచి గత 60 ఏళ్లలో భారత్‌లో రూ.7,000 కోట్లను ఖర్చు చేసినట్టు ప్రకటించారు.
మహిళలకు మరింత ప్రాతినిధ్యం
గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్‌లో నూడుల్స్‌తోపాటు కన్ఫెక్షనరీ తయారీ సామర్థ్యాలను నెస్లే విస్తరిస్తోంది. అలాగే పంజాబ్‌లోని మోగాలో, గోవాలోని పాండాలో ప్లాంట్లను విస్తరిస్తున్నట్టు నారాయణన్ తెలిపారు. మరింత మంది మహిళా ఉద్యోగులను చేర్చుకోనున్నట్టు చెప్పారు. కంపెనీ బోర్డులో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం ఉండగా, క్షేత్ర స్థాయి ఉద్యోగుల్లో 20 శాతం మంది మహిళలు పనిచేస్తున్నట్టు వెల్లడించారు. తమ కార్మిక శక్తిలో 25 శాతం మహిళల లక్ష్యానికి చేరువ అవుతున్నట్టు తెలిపారు. తమ సనంద్ ప్లాంట్‌లో అయితే సగం మంది కార్మికులు మహిళలే ఉన్నట్టు చెప్పారు. నెస్లే ఇండియాలో సుమారు 6,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment