న్యూఢిల్లీ: ముడి వస్తువులు, సెమీ కండక్టర్ల పెరుగుతున్న ధరలు, ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో సరఫరాపరమైన సమస్యలు మొదలైనవన్ని దేశీ ఆటోమొబైల్ పరిశ్రమకు ఈ ఏడాది సవాళ్లుగా ఉండనున్నాయని ఎంజీ మోటర్ ఇండియా ప్రెసిడెంట్ రాజీవ్ చాబా తెలిపారు. ఈ ఏడాది తొలినాళ్లలో 2022లో 10 శాతం పైగా వృద్ధిని దేశీ ఆటో పరిశ్రమ అంచనా వేసిందని .. కానీ పరిస్థితులు ఇలాగే కొనసాగితే డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
‘జనవరి, ఫిబ్రవరికి ముందు చూస్తే.. ఈ ఏడాది అమ్మకాలపరంగా అత్యుత్తమంగా ఉంటుందని, 2018లో సాధించిన దానికి మించి విక్రయాలు ఉండవచ్చని భారతీయ ఆటో పరిశ్రమ ఆశాభావంతో ఉంది. 10 శాతం పైగానే వృద్ధి ఉండొచ్చని అంచనా వేసింది. కానీ ఏప్రిల్ వచ్చే సరికి పరిస్థితులు మారాయి. డిమాండ్‌కు ప్రతికూల సవాళ్లు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి‘ అని చాబా పేర్కొన్నారు. ‘లోహాల ధరలు ఎగుస్తుండటంతో ముడి వస్తువుల రేట్లు భారీగా పెరిగిపోతుండటం ఇందుకు కారణం. సెమీకండక్టర్ల ధరలు కూడా పెరిగిపోయాయి.
భౌగోళిక రాజకీయ అంశాల కారణంగా .. ముఖ్యంగా ఉక్రెయిన్ ఉద్రిక్తతల వల్ల సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ద్రవ్యోల్బణం కూడా పెరిగే కొద్దీ ఆటోమోటివ్ విభాగంపైనా ప్రభావం పడవచ్చు. దీంతో డిమాండ్ తగ్గవచ్చు‘ అని ఆయన వివరించారు. ప్రస్తుతానికైతే మార్కెట్‌పై ఈ ప్రభావం ఇంకా కనిపించడం లేదని .. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే కచ్చితంగా సవాళ్లు ఎదురవుతాయని చాబా వివరించారు.
జియస్ వాహనానికి భారీ ఆర్డర్లు..
ప్రస్తుతానికి తమ సంస్థ విషయానికొస్తే.. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ జియస్ ఈవీకి నెలకు సుమారు 1,500 ఆర్డర్లు వస్తున్నాయని, కానీ తాము 300 యూనిట్లు మాత్రమే అందించగలుగుతున్నామని చాబా చెప్పారు. గ్లోస్టర్, జియస్ ఈవీలకు సంబంధించి ఈ ఏడాది మొత్తానికి సరిపడేంత ఆర్డర్లు ఉన్నాయన్నారు. ఆస్టర్, హెక్టర్ మోడల్స్ వెయిటింగ్ పీరియడ్ రెండు నుంచి ఆరు నెలల వరకూ ఉంటోందన్నారు. నెలకు 7,000 పైచిలుకు వాహనాలకు డిమాండ్ ఉండగా తాము 4,000 యూనిట్లు మాత్రమే తయారు చేయగలుగుతున్నామని చెప్పారు. ఈ నెల నుంచి తమ హలోల్ ప్లాంటులో రెండో షిఫ్ట్ కూడా ప్రారంభించామని చాబా పేర్కొన్నారు.
చదవండి: ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారును ఎగబడికొంటున్నారు..రేంజ్ కూడా అదుర్స్!
Comments
Please login to add a commentAdd a comment