ముంబై: ప్రముఖ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ నుంచి వచ్చిన టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్లకు చాలా మంచి స్పందన వస్తుంది. నెక్సన్ ఈవీని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ కాంపాక్ట్ ఎస్ యువీకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది. టాటా నెక్సన్ ఈవీ కారు ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనం. ఆటోమేకర్ పేర్కొన్నట్లుగా నెక్సన్ డీజిల్ వేరియంట్లకు పోటీగా ఈవీ కార్లకు డిమాండ్ ఏర్పడింది. ఆటోమేకర్ టాటా మోటార్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పీబీ బాలాజీ మీడియాతో మాట్లాడుతూ.. జూలై 2021లో నెక్సాన్ ఈవీ కార్ల కోసం ఆర్డర్లు అనేవి డీజిల్ వేరియంట్లకు పోటాపోటీగా వచ్చినట్లు చెప్పారు.
"కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీల వల్ల ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత ఆకర్షణీయంగా మారాయి". మొత్తం అమ్మకాల పరిమాణంలో నెక్సాన్ ఈవీ త్వరలో 5% చేరుకుంటుందని టాటా మోటార్స్ ఆశాభావంతో ఉన్నట్లు బాలాజీ తెలిపారు. టాటా మోటార్స్ మొత్తం అమ్మకాల్లో ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్ యువీ వాటా రెండు సంవత్సరాల క్రితం కేవలం 0.2% మాత్రమే అని అన్నారు. టాటా మోటార్స్ 2025 నాటికి 10 ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొని రానున్నట్లు ప్రకటించింది. అలాగే, ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కల్పించడానికి గణనీయంగా పెట్టుబడులు పెట్టుబడి పెడుతుంది. ఎఫ్ వై22 మొదటి(ఏప్రిల్-జూన్ మధ్య) త్రైమాసికంలో టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీకి చెందిన 1,716 యూనిట్లను విక్రయించింది.
గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఇటీవల ఈవీ విధానాలను ప్రకటించాయి. ఈ ఈవీ పాలసీలు వినియోగదారులకు సబ్సిడీలు అందించడం వల్ల ఈవీ తయారీదారులు మౌలిక సదుపాయాల కల్పనలో దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. నెక్సన్ ఈవీకి డిమాండ్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఫేమ్-2 పథకం వల్ల నెక్సన్ ఈవీ, నెక్సన్ డీజిల్ మధ్య ధరల అంతరం తగ్గింది. దీంతో వాహన కొనుగోలుదారులు డీజిల్ వేరియంట్లతో పోలిస్తే ఈవీ కార్లను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment