ముంబై: జీవితకాల గరిష్ట స్థాయిల నమోదు తర్వాత లాభాల స్వీకరణ జరగడంతో సోమవారం బుల్ జోరుకు బ్రేక్ పడింది. సరికొత్త రికార్డులతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 189 పాయింట్ల నష్టంతో 52,736 వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్లను కోల్పోయి 15,814 వద్ద నిలిచింది. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మూడేళ్లు గరిష్టానికి చేరుకోవడం కూడా మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. కోవిడ్ ప్రభావిత రంగాలకు కేంద్రం ప్రకటించిన రూ.1.1 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది.
ఐటీ, ఆర్థిక రంగాల షేర్లతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు ఒక శాతం క్షీణించి సూచీల ఆరంభ లాభాల్ని హరించి వేశాయి. అయితే ఫార్మా, మెటల్, బ్యాంకింగ్ షేర్లు రాణించి సూచీల భారీ పతనాన్ని అడ్డుకున్నాయి. ప్రైవేటీకరణ వార్తలతో ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు మరోసారి డిమాండ్ నెలకొంది. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమివ్వడంతో ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులు పెరగడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1659 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ. 1277 కోట్ల షేర్లను కొన్నారు.
రికార్డు లాభాలు మాయం...
దేశీయ మార్కెట్ ఉదయం సరికొత్త రికార్డులతో ట్రేడింగ్‌ను షురూ చేశాయి. సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 53,127 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 15,916 వద్ద మొదలయ్యాయి. ఈ ప్రారంభ స్థాయిలు సూచీలకు జీవితకాల గరిష్టాలు కావడం విశేషం. ఆసియాలో పలు దేశాల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరగడంతో అక్కడి మార్కెట్లు నష్టాల్లో కదలాడటం మన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అలాగే సూచీలు ఆల్‌టైం హైని తాకిన తర్వాత లాభాల స్వీకరణ జరిగింది. మిడ్ సెషన్ తర్వాత యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారం భం, ఆర్థిక మంత్రి ఉద్దీపన చర్యలు మెప్పించకపోవడంతో అమ్మకాల ఉధృతి మరింత పెరిగింది.
బుల్ జోరుకు బ్రేక్..
Published Tue, Jun 29 2021 7:31 AM | Last Updated on Tue, Jun 29 2021 7:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment