
ముంబై: అదానీ గ్రూప్ వ్యవహారంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీ పతనాన్ని చవిచూసిన సూచీలు.., చివరికి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే 539 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ చివరికి 77 పాయింట్ల లాభంతో 52,552 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 194 పాయింట్లను కోల్పోయినా.., 13 పాయింట్ల లాభంతో 15,800 పైన 15,812 వద్ద ముగిసింది. సూచీలకిది వరుసగా మూడోరోజూ లాభాల ముగింపు. మిడ్‌సెషన్‌లో సెన్సెక్స్ 52,591 వద్ద, నిఫ్టీ 15,823 గరిష్టాలను అందుకున్నాయి. రెండు సూచీలకు ముగింపు, ఇంట్రాడే స్థాయిలు జీవితకాల గరిష్టాలు కావడం విశేషం. దీంతో సూచీల ర్యాలీ కొనసాగినట్లైంది. అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు రాణించడం, ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం, దేశంలో కోవిడ్ కేసులు తగ్గడం తదితర అంశాలు కలిసిరావడంతో సూచీలు ఆరంభ నష్టాలను పూడ్చుకోగలిగాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించగా, తక్కిన రంగాల షేర్లలో అమ్మకాలు జరిగాయి. మెటల్ షేర్లు అధికంగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.504 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. దేశీయ ఫండ్స్(డీఐఐలు) రూ.244 కోట్ల షేర్లను కొన్నారు. ఇక ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ వరుసగా ఐదోరోజూ నష్టపోయింది. డాలర్ మారకంలో 22 పైసలు పతనమై 73.29 వద్ద స్థిరపడింది.
మూడ్‌ను దెబ్బతీసిన అదానీ వ్యవహారం
ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ ఫండ్ల అకౌంట్లను ఎస్‌సీడీఎల్ నిలిపివేసిందనే వార్తలతో ట్రేడింగ్ ఆరంభమైన కొద్ది నిమిషాలకే సెన్సెక్స్ 539 పాయింట్లను కోల్పోయి 51,936 వద్ద, నిఫ్టీ 194 పాయింట్లు నష్టపోయి 15,605 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు సూచీల రికవరీకి తోడ్పాటును అందించింది. ఒక దశలో 2% ర్యాలీ చేసి రూ.2,258 గరిష్టాన్ని అందుకుంది. చివరికి 1.5% లాభంతో రూ.2,245 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment