ముంబై, సాక్షి: ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు ముందున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు తొలుత తడబడినప్పటికీ చివరికి లాభాలతో నిలిచాయి. వెరసి వరుసగా ఆరు రోజూ ర్యాలీ బాటలో సాగాయి. సెన్సెక్స్ 133 పాయింట్లు పుంజుకుని 47,746కు చేరగా.. నిఫ్టీ 49 పాయింట్లు బలపడి 13,982 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా.. తొలుత 13,865 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరిన నిఫ్టీ చివర్లో 13,997 వరకూ ఎగసింది. వెరసి 14,000 పాయింట్ల మైలురాయికి చేరువలో నిలిచింది. ఇక సెన్సెక్స్ సైతం 47,808-47,358 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నేటితో కలిపి 21 సెషన్లలో 15సార్లు మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు గురువారం డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనుండటంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు.
ఫార్మా డీలా
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్, ఆటో, రియల్టీ 1.3 శాతం చొప్పున పుంజుకోగా.. బ్యాంకింగ్, ఫార్మా 0.2 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్, గ్రాసిమ్, శ్రీ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, ఐషర్, యూపీఎల్, మారుతీ, ఎంఅండ్‌ఎం, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్ 4.5-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే ఇండస్‌ఇండ్, సన్ ఫార్మా, యాక్సిస్, ఎస్‌బీఐ, ఎయిర్‌టెల్, టీసీఎస్, గెయిల్, సిప్లా, ఇన్ఫోసిస్ 1.5-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.
సెయిల్ ప్లస్
డెరివేటివ్ స్టాక్స్‌లో సెయిల్, రామ్‌కో సిమెంట్, బాలకృష్ణ, జీఎంఆర్, అంబుజా, కెనరా బ్యాంక్, ఎన్‌ఎండీసీ, జిందాల్ స్టీల్ 7.5-2.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఆర్‌ఈసీ, అదానీ ఎంటర్, పీఎఫ్‌సీ, పేజ్, బంధన్ బ్యాంక్, ఇండస్ టవర్స్, పీఎన్‌బీ, భారత్ ఫోర్జ్, సన్ టీవీ 2-1.2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,671 లాభపడగా.. 1,282 నష్టాలతో ముగిశాయి.
ఎఫ్‌పీఐల జోరు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,349 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,010 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1,589 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,387 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment