న్యూఢిల్లీ: కార్ల తయారీలో ఉన్న జపాన్ సంస్థ టయోటా ఓ పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఫ్లెక్స్ ఫ్యూయల్–స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను అభివృద్ధి చేయనుంది. బ్యాటరీతోపాటు 100 శాతం ఇథనాల్‌తో ఇది పరుగెడుతుంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టును మంగళవారం ప్రారంభించారు.
పైలట్ ప్రాజెక్ట్ కోసం బ్రెజిల్ నుంచి తెప్పించిన టయోటా కరోలా ఆల్టిస్ ఫ్లెక్స్ ఫ్యూయల్–స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ వాహనానికి ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్‌తోపాటు ఎలక్ట్రిక్ పవర్‌ట్రైయిన్ పొందుపరిచారు. ఫ్లెక్స్–ఫ్యూయల్ అనుకూల కార్లు ఒకటి కంటే ఎక్కువ రకాల ఇంధనం లేదా మిశ్రమంతో కూడా నడుస్తాయి. సాధారణంగా పెట్రోల్‌తోపాటు ఇథనాల్ లేదా మిథనాల్ మిశ్రమం ఉపయోగిస్తారు. 20 నుంచి 100 శాతం వరకు ఇథనాల్‌ను వినియోగించవచ్చు. ఇటువంటి వాహనాలు బ్రెజిల్, యూఎస్‌ఏ, కెనడాలో ప్రస్తుతం వాడకంలో ఉన్నాయి.
దేశంలో కాలుష్యం పెద్ద ఆందోళన కలిగిస్తోందని మంత్రి అన్నారు. రవాణా రంగం కాలుష్యానికి దోహదపడుతోందని చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తోపాటు ఇథనాల్, మిథనాల్ వంటి జీవ ఇంధనాలతో నడిచే వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. భారతదేశం అతి తక్కువ సమయంలో 10 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని సాధించిందని టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ అన్నారు. 2025 నాటికి ఇది 20 శాతానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment