న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సేంజీ (ఎన్‌ఎస్‌ఈ)లో కో–లొకేషన్ వివాదానికి సంబంధించి వివిధ దర్యాప్తు బృందాలు ఇందులోని మరిన్ని కొత్త కోణాలపై విచారణ జరుపుతున్నాయి. సర్వర్లు, డేటా అందించడంలో కొంత మంది బ్రోకర్లకు ప్రా«ధా న్యం ఇవ్వడం, ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేయడం వంటి అంశాల్లో ఎవరెలా లబ్ధి పొందినదీ వెలికి తీయడంపై దృష్టి పెడుతున్నాయి. ఇది అచ్చం క్రికెట్ బెట్టింగ్ స్కామ్‌లాగా పని చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అరసెకను ముందు తెలిసినా..
‘సాధారణ ఇన్వెస్టరు లేదా బ్రోకర్ తన సాధారణ టెర్మినల్ మీద ట్రేడింగ్ చేయడమంటే.. క్రికెట్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్‌ను టీవీలో లేదా స్టేడియంలో చూసినట్లుగా ఉంటుంది. అయితే, ఫీల్డ్‌లోని ప్రతి ఆటగాడి కదలికలు, వారు ఏం చేయబోతున్నారన్నది మిగతా వారి కన్నా ముందుగానే తెలిసిపోతే ఎలా ఉంటుంది? కాస్త లోతుగా ఆలోచిస్తే ఎవరెలా నష్టపోతున్నారన్నది అర్థమవుతుంది. మార్కెట్ డేటా మిగతావారికన్నా అరసెకను ముందు వచ్చినా ట్రేడర్లు బోలెడంత లబ్ధి పొందుతారు‘ అని ఒక అధికారి పేర్కొన్నారు.
కొనసాగుతున్న విచారణ
అధిక మొత్తం చెల్లించిన బ్రోకింగ్ సంస్థలకు స్టాక్ ఎక్సేంజీలో సర్వర్లు ఏర్పాటు చేసుకునేందుకు, మిగతా వారితో పోలిస్తే ముందుగా డేటాను పొందే వెసులుబాటు పొందేందుకు ఎన్‌ఎస్‌ఈ వివాదాస్పద కో–లొకేషన్ విధానం అమ లు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈవోలు చిత్రా రామకృష్ణ, రవి నారాయణ్ తదితరులపై విచారణ జరుగుతోంది.
చిన్న ఇన్వెస్టర్లకూ నష్టమే
దీనివల్ల చిన్న ఇన్వెస్టర్లకు పెద్దగా నష్టం లేదనడాన్ని ఆయన కొట్టిపారేశారు. ‘చిన్న ఇన్వెస్టర్లకు పెద్దగా నష్టం వాటిల్లలేదని వాదించడం అర్థరహితం. వారికి షేరుపై రూపాయో లేదా కొన్ని చిల్లర పైసల్లోనో నష్టం వచ్చి ఉండవచ్చు. కానీ రోజూ కొన్ని లక్షలు కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరుగుతున్నప్పుడు.. కేవలం కొద్ది మంది బ్రోకర్లు ఏళ్ల తరబడి వందలు, వేల కోట్ల మేర లబ్ధి పొంది ఉంటారు‘ అని ఒక అధికారి వివరించారు.
అక్రమ సంపాదన
ఇటీవల బైటపడిన కొన్ని అంశాలను బట్టి ఉన్నత స్థానం లోని కొందరు.. ట్రేడింగ్ స్లాట్ల కేటాయింపులో కొంత మందికి ప్రాధాన్యమివ్వడం ద్వారా దశాబ్ద కాలంగా అక్రమంగా భారీ మొత్తం కూడబెట్టుకుని ఉంటారన్న అనుమానాలు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సంబంధించి 2009–2016 కాలంలో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ పరిశీలించనున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment