ఓలా ఈ–బైక్‌ 501 కిలోమీటర్లు  | Ola Electric New Bike Launch | Sakshi
Sakshi News home page

ఓలా ఈ–బైక్‌ 501 కిలోమీటర్లు 

Published Thu, Feb 6 2025 5:36 AM | Last Updated on Thu, Feb 6 2025 7:17 AM

Ola Electric New Bike Launch

రోడ్‌స్టర్‌ ఎక్స్‌ సిరీస్‌ విడుదల 

ప్రారంభ ధర రూ.74,999  

వచ్చే ఏడాది రోడ్‌స్టర్‌ ప్రో రాక

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఓలా ఎలక్ట్రిక్‌ తాజాగా రోడ్‌స్టర్‌ ఎక్స్‌ సిరీస్‌తో మోటార్‌సైకిల్స్‌ విభాగంలోకి ప్రవేశించింది. రోడ్‌స్టర్‌ ఎక్స్, రోడ్‌స్టర్‌ ఎక్స్‌ ప్లస్‌ మోడళ్లను ఆవిష్కరించింది. ధర రూ.74,999 నుంచి ప్రారంభమై రూ.1,54,999 వరకు ఉంది. వాహనం పరుగెడుతున్నప్పుడు కూడా చార్జింగ్‌ అవుతుంది. ఐపీ67 రేటెడ్‌ బ్యాటరీ, స్మార్ట్‌ కనెక్టివిటీతో 4.3 అంగుళాల ఎల్‌సీడీ, ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్, రివర్స్‌ మోడ్‌ వంటి ఏర్పాటు ఉంది. గరిష్ట పవర్‌ 7–11 కిలోవాట్‌ ఉంది.  

నిర్వహణ వ్యయం రూ.500.. 
రోడ్‌స్టర్‌ ఎక్స్‌ సిరీస్‌లో వేరియంట్‌నుబట్టి 2.5–4.5 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 140–252 కిలోమీటర్లు పరిగెడుతుంది. గరిష్ట వేగం గంటకు 105–118 కిలోమీటర్లు. రోడ్‌స్టర్‌ ఎక్స్‌ ప్లస్‌ సిరీస్‌లో 4.5–9.1 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఒకసారి చార్జింగ్‌తో 252–501 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్లు. నెలవారీ నిర్వహణ వ్యయం పెట్రోల్‌ బైక్‌కు రూ.4,000 అయితే రోడ్‌స్టర్‌ ఎక్స్‌తో రూ.500 మాత్రమేనని ఓలా తెలిపింది. మార్చిలో డెలివరీలు ఉంటాయి.  

మరో రెండు మోడల్స్‌.. 
రోడ్‌స్టర్, రోడ్‌స్టర్‌ ప్రో మోడల్స్‌లో సైతం కంపెనీ పలు వేరియంట్లను రూపొందిస్తోంది. రోడ్‌స్టర్‌లో 3.5–6 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ ఉంది. ఒకసారి చార్జింగ్‌తో 151–248 కి.మీ. ప్రయాణిస్తాయి. గరిష్ట వేగం గంటకు 116–126 కిలోమీటర్లు. ధర రూ.1,04,999 నుంచి రూ.1,39,999 వరకు ఉంది. అలాగే రోడ్‌స్టర్‌ ప్రో సిరీస్‌లో 8–16 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 316–579 కిలోమీటర్లు పరుగు తీస్తాయి. గరిష్ట వేగం గంటకు 154–194 కిలోమీటర్లు. ధర రూ.1,99,999 నుంచి రూ.2,49,999 వరకు ఉంది. డెలివరీలు 2026 జనవరి నుంచి మొదలవుతాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement