ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ల నుంచి వచ్చిన 10,644 ఫిర్యాదుల్లో 99.1 శాతం పరిష్కరించినట్లు తెలిపింది. సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి పది వేలకుపైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ గతంలో తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వచ్చాయి.
ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజులు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం అందిన 10,644 ఫిర్యాదుల్లో 99.1 శాతం సమస్యలను పరిష్కరించినట్లు తాజాగా కంపెనీ పేర్కొంది. ఏ కంపెనీ అయినా కస్టమర్లకు సరైన సర్వీసు అందించకపోతే దానికి ఆదరణ తగ్గుతుంది. ఫలితంగా కంపెనీకి కస్టమర్లు తగ్గి రెవెన్యూ దెబ్బతింటుంది. కంపెనీలకు అతీతంగా ప్రతి సంస్థ స్పందించి కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ చదవండి: గూగుల్ 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..
కంపెనీ సర్వీసుకు సంబంధించి ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య సామాజిక మాధ్యమాలు వేదికగా వివాదం నెలకొంది. కంపెనీ సర్వీసు సరిగా లేదని పేర్కొంటూ సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఓలా ఎలక్ట్రిక్ వాహనాల ఫొటోను కమ్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై భవిష్ స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. అదే సమయంలో నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదులు రావడంపై సీసీపీఏ ఓలాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment