
కార్పోరేట్ ప్రపంచంలో బ్రాండ్ వ్యాల్యూ అనేది ఎంతో ముఖ్యం. కొన్ని కంపెనీలు ఈ బ్రాండ్ వ్యాల్యూ సాధించేందుకు ఏళ్లకేళ్లు కష్టపడతాయి. ఒక్కసారి బ్రాండ్ ఇమేజ్ వచ్చాక దాన్ని కాపాడుకునేందుకు నిరంతరం శ్రమిస్తాయి. తాజాగా ఓలా బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకునేందుకు ఆ కంపెనీ సీఈవో భవీశ్ అగర్వాల్ నడుం బిగించాడు.
గేమ్ ఛేంజర్
ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించి గత ఐదేళ్లుగా ఎన్నో కంపెనీలు ప్రయత్నించినా.. ఓలా వచ్చిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ప్రీ బుకింగ్‌లోనే లక్షకు పైగా ఆర్డర్లు సాధించింది. లక్ష రూపాయలు చెల్లించి.. స్కూటర్ డెలివరీ కోసం నెలల తరబడి కస్టమర్లు ఎదురు చూశారు. 2021 అక్టోబరు నుంచి 2022 మార్చి వరకు చిన్న చిన్న సమస్యలు ఉన్నా సర్థుకుపోయారు. ఓలా బ్రాండ్‌పై నమ్మకం కనబరిచారు.
కష్టాలు మొదలు
వేసవి ఆరంభం కావడంతోనే ఓలాకు కష్టాలు వచ్చిపడ్డాయి. మొదట పూనేలో ఓలా స్కూటర్ ఉన్నట్టుండి తగలబడిపోయింది. ఆ తర్వాత దేశంలో పలు ప్రాంతాల్లో ఓలాతో పాటు ఇతర ఈవీ స్కూటర్లు అగ్ని ప్రమాదాల్లో చిక్కుకోవడం మొదలైంది. మరోవైపు కొన్ని స్కూటర్లలో బ్యాటరీ ఛార్జింగ్ తదితర సమస్యలు వెంటాడాయి. కానీ వీటిని సకాలంలో పరిష్కరించడంలో ఓలా విఫలమైంది. ఫలితంగా ఒక యూజర్ తన ఓలా స్కూటర్‌ను గాడిదతో కట్టి ఊరేంగిచగా మరొకరు పెట్రోలు పోసి నిప్పు అంటించాడు.
ఏకీ పారేస్తున్నారు
ఈవీ స్కూటర్లలో వరుసగా చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలకు పై రెండు ఘటనలు తోడవటం ఓలాకు చిక్కులు తెచ్చి పెట్టింది. ఓలా కస్టమర్ కేర్ తీరును ఎండగడుతూ కొందరు, డెలివరీలో ఆలస్యాన్ని నిరసిస్తూ మరికొందరు, ముందుగా చెప్పిన ఫీచర్లు ఎప్పుడు అన్‌లాక్ చేస్తారంటూ మరికొందరు ఓలాను ఏకీ పారేస్తున్నారు. దీంతో బ్రాండ్‌కు చెడ్డ పేరు రాకుండా డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడ్డారు భవీశ్ అగర్వాల్
అప్రమత్తమైన భవీశ్
ఓలా స్కూటర్ల విజయ ప్రస్థానాన్ని రోజుకో రకంగా వివరిస్తున్నారు. కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెస్తున్న విషయాన్ని చెబుతూనే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓలా ఇండియాలో నంబర్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్‌గా మారిందంటూ వివరించారు. ఆ తర్వాత రోజు ప్రధానీ మోదీ కంటే కూడా మమ్మల్నే ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ప్రత్యర్థి కంపెనీలు మా మీద విషం చల్లడం ఆపి వాళ్ల పని చూసుకుంటే బెటర్ అంటూ తమపై వస్తున్న విమర్శల తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు.
డ్యామేజ్ కంట్రోల్ యత్నాలు
తాజాగా గిగ్ ఎకానమీగా రోజురోజుకు పెరుగుతున్న డెలివరీ సర్వీసులను ఉద్దేశిస్తూ ప్రపంచంలోనే డెలివరీ సర్వీసులకు ఓలా స్కూటర్లు ఉత్తమం అంటూ ఓ ఫోటోను జోడించి ట్వీట్ చేశారు. డెలివరీ బ్యాగును వీపుకు మోయం కాకుండా స్కూటర్ ముందు భాగంలో పెట్టుకోవచ్చని అక్కడ కావాల్సినంత లెగ రూమ్ ఉందన్నట్టుగా ఫోటోలో చూపారు. మొత్తంగా నలువైపులా ఓలాపై వస్తున్న విమర్శలు భవీశ్ అగర్వాల్‌లో కాక రేపాయి. దీంతో బ్రాండ్ ఇమేజ్ కాపాడుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.
Probably the best looking food delivery vehicle in the world 😍 pic.twitter.com/611oc2JOoc
— Bhavish Aggarwal (@bhash) May 4, 2022
చదవండి: Bhavish Aggarwal: ఆ విషయంలో ప్రధాని మోదీ కంటే నేనే తోపు!
Comments
Please login to add a commentAdd a comment