ఫాక్స్‌కాన్ నియామక పద్ధతులపై వచ్చిన వార్తలపై ఓలా వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ భవీష్ అగర్వాల్ స్పందించారు. తమ కొత్త కర్మాగారాల్లో వివాహితలతో సహా మహిళల నియామకం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వివాహితలను నియమించుకోవడంపై ఓలాకు ఎటువంటి వ్యతిరేక విధానం లేదని అగర్వాల్ పేర్కొన్నారు.
ఇటీవల ఓ మీడియా సమావేశంలో భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. 'మహిళలు ఎక్కువ క్రమశిక్షణ, నైపుణ్యంతో ఉంటారు. మేము మా కర్మాగారాలలో మహిళా శ్రామిక శక్తిని నియమించడం కొనసాగిస్తాం. పెళ్లైన మహిళలను నియమించుకోకూడదనే ఫాక్స్‌కాన్ లాంటి విధానాలు మా దగ్గర లేవు’ అన్నారు.
భారత్‌లో మహిళా శ్రామిక శక్తి తక్కువగా ఉందని, దీనిని పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం జూనియర్ స్థాయి ఉద్యోగాల్లో మహిళలను ఎక్కువగా నియమించుకుంటున్నామని, సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో కూడా మరింత మంది మహిళలను నియమించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.
కాగా మహిళా శ్రామిక శక్తిని పెంపొందించడంపై ఓలా ఎలక్ట్రిక్ గతంలోనే తమ వైఖరిని ప్రకటించింది. "ఈ రోజు, ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీని పూర్తిగా మహిళలే నడుపుతారని ప్రకటించడానికి నేను గర్విస్తున్నాను. ఈ వారం మేము మొదటి బ్యాచ్ ను స్వాగతించాం. పూర్తి సామర్థ్యంతో, ఫ్యూచర్ ఫ్యాక్టరీ 10,000 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తుంది, ఇది మహిళలకు మాత్రమే పనిచేసే ప్రపంచంలోనే అతిపెద్ద కర్మాగారం, ఏకైక మహిళా ఆటోమోటివ్ తయారీ కేంద్రంగా మారుతుంది'' అని బ్లాగ్ పోస్ట్‌లో భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు.
యాపిల్ ఉత్పత్తుల అతిపెద్ద సరఫరాదారు అయిన ఫాక్స్‌కాన్ భారత్‌లోని తన ఐఫోన్ కర్మాగారంలో వివాహిత మహిళలను ఉద్యోగాలకు తిరస్కరిస్తున్నట్లు ఇటీవలి పరిశోధనాత్మక నివేదిక బహిర్గతం చేసింది. తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఉన్న ప్రధాన ఐఫోన్ అసెంబ్లింగ్ ఫ్యాక్టరీలో వివాహిత మహిళలను ఉద్యోగావకాశాల నుంచి తప్పించారని నివేదిక ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment