న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఓఎన్‌జీసీ చమురు, గ్యాస్ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టింది. అరేబియా సముద్రంలో 103 బావుల్లో వచ్చే 2–3 ఏళ్లలో డ్రిల్లింగ్ చేయనున్నట్టు ప్రకటించింది. ‘‘దీనివల్ల 100 మిలియన్ టన్నుల ఆయిల్, గ్యాస్ అదనంగా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అదనంగా ఉత్పత్తయ్యే మేర దిగుమతుల భారం తగ్గుతుంది’’ అని ఓఎన్‌జీసీ ప్రకటించింది. మనదేశ చమురు అవసరాల్లో 85 శాతం మేర దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే.
అలాగే సహజవాయువు అవసరాల్లో సగం మేర దిగుమతులైనే ఆధారపడి ఉన్నాం. దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చమురు కంపెనీలను కోరడం గమనార్హం. ఓఎన్‌జీసీ ఉత్పత్తి గత కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తోంది. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఉత్పత్తి క్షీణత ఉండదని ఓఎన్‌జీసీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చమురు ఉత్పత్తి 22.83 మిలియన్ టన్నులుగా, గ్యాస్ ఉత్పత్తి 22.099 బీసీఎంకు పెరుగుతుందని భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చమురు ఉత్పత్తి 24.63 మిలియన్ టన్నులు, గ్యాస్ ఉత్పత్తి 25.68 బీసీఎంకు చేరుకుంటుందన్న అంచనాతో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment