న్యూఢిల్లీ: ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ తమపై ఇటీవల విధించిన 28 శాతం జీఎస్‌టీని తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది. అధిక పన్ను భారం చట్టవిరుద్ధమైన గేమింగ్ సంస్థలను పరోక్షంగా ప్రోత్సహించినట్టు అవుతుందని పేర్కొంది. చట్టవిరుద్ధమైన, ఆఫ్‌షోర్ గేమింగ్ సంస్థలకు ఎలాంటి పన్ను భారం ఉండదని, ప్రభుత్వ నిర్ణయం చట్ట పరిధిలో పనిచేసే ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలను రిస్క్‌లోకి నెడుతుందని ఇండియన్ గేమర్స్ యునైటెడ్ ఆందోళన వ్యక్తం చేసింది.
టైర్–2, 3 పట్టణాల్లోని ఆన్‌లైన్ గేమర్స్‌తో కూడిన ఈ అసోసియేషన్ ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఓ లేఖ రాసింది. గ్యాంబ్లింగ్‌కు, స్కిల్ గేమింగ్‌కు స్పష్టమైన వ్యత్యాసం చూపించాలని సూచించింది. అన్ని రకాల గేమింగ్ సంస్థలను 28 శాతం పన్ను పరిధిలోకి తీసుకొస్తూ ఈ నెల మొదట్లో జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
గుర్రపు పందేలు, జూదం వంటి అదృష్టాన్ని పరీక్షించుకునే గేమ్‌లు, నైపుణ్యాలతో కూడిన గేమ్‌లను ఒకే గాటన కట్టొద్దంటూ, ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని తిరిగి సమీక్షించాలని అసోసియేషన్ కోరింది. పన్ను పరంగా అనుకూలంగా ఉండేలా పరిశ్రమ పట్ల వ్యవహరించాలని సూచించింది. ఆన్‌లైన్ స్కిల్ గేమింగ్‌లను యువత తమ గేమింగ్ నైపుణ్యాలతో ఆడుతూ, కొంత ఆదాయాన్ని ఆర్జిస్తోందని వివరిస్తూ.. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నట్టు తెలిపింది.
28 శాతం జీఎస్‌టీ అనేది ఎదుగుతున్న ఆన్‌లైన్ స్కిల్ గేమింగ్ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. మరోవైపు బుధవారం సమావేశమయ్యే జీఎస్‌టీ కౌన్సిల్.. గేమింగ్ పరిశ్రమకు సంబంధించి 28 శాతం జీఎస్‌టీ అమలు విధి విధానాలను ఖరారు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment