
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Tesla CEO Elon Musk) తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడు ఒరాకిల్ (Oracle) వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆయన మొత్తం సంపద 373 బిలియన్ డాలర్లు (సుమారు రూ.31 లక్షల కోట్లు). ఏఐ బూమ్ కారణంగా ఒరాకిల్ స్టాక్ విలువ భారీగా పెరగడంతో గత కొన్ని నెలల్లో ఎల్లిసన్ సంపద వేగంగా ఎగిసింది.
లారీ ఎల్లిసన్ ( Larry Ellison) 2010లోనే గివింగ్ ప్లెడ్జ్ తీసుకున్నారు. ఇందులో భాగంగా తన సంపదలో 95 శాతం విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు. అయితే సాంప్రదాయ సామాజిక సంస్థల ద్వారా కాకుండా తన సొంత నిబంధనలపై సంపదను ఇవ్వడానికి ఇష్టపడతానని చెబుతారు. అలాగే విరాళాలు ఇస్తూ వస్తున్నారు.
విరాళం ఎలా ఇవ్వాలనుకుంటున్నారంటే..
లారీ ఎల్లిసన్ తన సంపదను ఎలా ఇవ్వాలని యోచిస్తున్నాడో ఫార్చ్యూన్ ఒక నివేదికలో వెల్లడించింది. ఎల్లిసన్ నెట్‌వర్త్ సెప్టెంబర్ 2025 నాటికి 373 బిలియన్ డాలర్లని అంచనా. టెస్లాలో గణనీయమైన పెట్టుబడితో పాటు ఒరాకిల్‌లో ఆయనకున్న 41 శాతం వాటా నుంచే ఆయన సంపదలో ఎక్కువ భాగం వచ్చింది.
ఎల్లిసన్ తన దాతృత్వ కార్యక్రమాల్ని ప్రధానంగా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన లాభాపేక్ష లేని సంస్థ ఎల్లిసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (EIT) ద్వారా కొనసాగిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ, ఆహార కొరత, వాతావరణ మార్పు, ఏఐ పరిశోధనతో సహా ప్రపంచ సవాళ్లపై ఈ సంస్థ దృష్టి పెడుతుంది. సుమారు 1.3 బిలియన్ డాలర్ల విలువైన ఈ సంస్థ కొత్త మెయిన్ క్యాంపస్ 2027 నాటికి ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో ప్రారంభం కానుంది.
కొన్నేళ్లుగా ఎల్లిసన్ అనేక భారీ స్థాయి విరాళాలు ఇచ్చారు. క్యాన్సర్ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించడానికి దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి 200 మిలియన్ డాలర్లు, ఎల్లిసన్ మెడికల్ ఫౌండేషన్ కు సుమారు 1 బిలియన్ డాలర్లు ఇచ్చారు.
ఇదీ చదవండి: క్లాసులకు వెళ్తున్న ఇషా అంబానీ.. టీచర్ ఏమన్నారంటే..