టెక్ కుబేరుల అడ్డా.. ఈ నగరమే!
కాలిఫోర్నియా సరికొత్త టెక్ బిలియనీర్ గా ఈ ఏడాది ఫేస్బుక్ స్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ అవతరించారు. 54 బిలియన్ డాలర్ల (రూ.36,0747 కోట్ల) సంపదతో టెక్ రంగంలో అత్యంత సంపన్నుడిగా నిలిచిన ఆయన.. ఒరాకిల్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ల్యారీ ఎలిసన్ను అధిగమించారు. గత ఏడాది కాలిఫోర్నియా అత్యంత సంపన్నుడి టైటిల్ ఎలిసన్ కు దక్కింది. ఫోర్బ్స్ పత్రిక తాజాగా ప్రచురించిన రెండో వార్షిక టెక్ కుబేరుల జాబితాలో జ్యూక్ మొదటి స్థానంలో నిలువగా.. రెండోస్థానంలో ఎలిసన్ నిలిచారు.
టాప్ 100 మంది టెక్ బిలియనీర్లతో ఫోర్బ్స్ జాబితా రూపొందించగా అందులో 37 మంది టెక్ దిగ్గజాలు అమెరికాలోని కాలిఫోర్నియాలోనే నివసిస్తుండటం గమనార్హం. టెక్ మహా సంపన్నులుగా కీర్తి గడించిన వీరి ఉమ్మడి సంపద 332.4 బిలియన్లు కాగా.. ప్రపంచ టాప్ 100 టెక్ కుబేరుల సంపదలో ఇది మూడోవంతు కావడం విశేషం.
గత ఏడాది ఫేస్ బుక్ షేర్ విలువ రాకెట్ వేగంతో పెరిగిపోవడంతో జుకర్ బర్గ్ సంపద అమాతం పెరిగిపోయింది. ఫేస్ బుక్ స్టాక్ విలువ ఏకంగా 30శాతం పెరుగడంతో ఆయన సంపదకు అదనంగా 12.8 బిలియన్ డాలర్లు పోగయ్యాయి. ఇక తన జీవితకాలంలో ఫేస్ బుక్ లోని 99శాతం వాటాను సేవాకార్యక్రమాలకు వెచ్చిస్తానని ప్రకటించి జ్యూక్ తన ఉదారగుణాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే.
టెక్ కుబేరుడిగా ఫోర్బ్స్ జాబితాలో రెండోస్థానంలో ఉన్న ఒరాకిల్ స్థాపకుడు ల్యారీ ఎలిసన్ సంపద గత ఏడాదికాలంలో ఏమంతగా పెరుగలేదు. దీనికితోడు ఒరాకిల్ స్టాక్ విలువ గతంలో పడిపోయినప్పటికీ.. అది రికవరీ చేసుకోవడానికి గడిచిన ఏడాది సరిపోయింది. ఎలిసన్ నికర సంపద ప్రస్తుతం 51.7 బిలియన్ డాలర్లు (రూ. 34,5381 కోట్లు)గా ఉంది.
ఈ ఇద్దరే కాదు కాలిఫోర్నియాకు చెందిన పలువురు టెక్ దిగ్గజాలు కూడా ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించారు. గూగుల్ సహ వ్యవస్థాపకులు ల్యారీపేజ్, సెర్గీ బ్రిన్ వరుసగా 39 బిలియన్ డాలర్లు, 38.2 బిలియన్ డార్లతో ఈ జాబితాలో చేరారు. గూగుల్ స్టాక్ విలువ 20శాతం పెరుగడంతో వీరి సంపద ఉమ్మడిగా 11బిలియన్ డాలర్లమేర పెరిగింది. ఇక కాలిఫోర్నియాలో నివసించే ఐదో రిచెస్ట్ టెక్ బిలియనీర్ గా గూగుల్ చైర్మన్ ఎరిక్ షుమిడ్ట్ 11.2 బిలియన్ డాలర్ల సంపదతో నిలిచారు.
కాలిఫోర్నియాకు చెందిన ఏకైక మహిళ టెక్ బిలియనీర్ గా మెగ్ వైట్మన్ నిలిచారు. హ్యావ్లెట్ పాకర్డ్ ఎంటర్ ప్రైస్ సీఎవో అయిన ఆమె 2.2 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో చోటు సంపాదించారు. ఈ-బే కంపెనీకి ఒక దశాబ్దంపాటు సీఈవోగా వ్యవహరించిన వైట్మన్ కు ఆమె సంపదలో అధికమొత్తం 'ఈబే' ద్వారానే దక్కింది.