న్యూఢిల్లీ: పేటీఎం ఎండీ, సీఈవోగా విజయ్ శేఖర్ శర్మ పునర్ నియామకానికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ ఇన్‌స్టిట్యూషనల్ అడ్వైజరీ సర్వీసెస్ సంస్థ (ఐఐఏఎస్) కీలక సూచన చేసింది. లిస్టెడ్ కంపెనీలు వాటాదారుల ముందు ఓటింగ్‌కు పెట్టే తీర్మానాలపై ఈ సంస్థ తన సలహా, సూచనలు చేస్తుంటుంది. పేటీఎం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మాధుర్ దియోరా పారితోషికానికి వ్యతిరేకంగా సూచన చేసింది. అదే సమయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, ప్రెసిడెంట్, గ్రూపు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా దియోరా నియామకానికి (2022 మే 20 నుంచి ఐదేళ్లపాటు) అనుకూలంగా సూచించింది.
‘‘వన్ 97 కమ్యూనికేషన్స్(పేటీఎం) షేరు ఐపీవో ఇష్యూ ధర రూ.2,150 నుంచి 63.6 శాతం పడిపోయింది. ఇది వాటాదారుల సంపదను హరించివేసింది. 2021–22 సంవత్సరంలో రూ.1,200 కోట్ల నగదు నష్టాలను ప్రకటించింది. 2022–23 మొదటి త్రైమసికంలోనూ నష్టాలు ఎక్కువగానే ఉన్నాయి. కంపెనీని లాభాల్లోకి తీసుకొస్తానంటూ విజయ్ శేఖర్‌శర్మ గతంలో పలుమార్లు ప్రకటించారు. కానీ, అవేవీ ఆచరణలో కనిపించలేదు. కనుక కంపెనీకి నిపుణులతో కూడిన బోర్డు ఉండాలని మేము నమ్ముతున్నాం’’అని ఐఐఏఎస్ తన నివేదికలో పేర్కొంది.
పదవీకాలంపై ఆందోళన
విజయ్ శేఖర్ శర్మ రొటేషన్ పద్ధతిలో రిటైర్ కావాల్సిన అవసరం లేకపోవడం పట్ల ఐఐఏఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ఎండీగా పదవీకాలం తర్వాత శర్మ నాన్ ఎగ్జిక్యూటివ్ హోదాలో కొనసాగేట్టు అయితే బోర్డులో శాశ్వతంగా ఉండొచ్చు’’అని పేర్కొంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ కంపెనీల సీఈవోలతో పోలిస్తే అతడి పారితోషికం ఎక్కువగా ఉందని తెలిపింది. దీనిపై పేటీఎం సీనియర్ ఉద్యోగి ఒకరు స్పందిస్తూ.. ప్రాక్సీ సంస్థలు తమ సేవలు తీసుకుంటున్న క్లయింట్లకు కేవలం సూచనలు మాత్రమే చేస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment