పేటీఎం అధ్యక్షుడు అమిత్ నాయర్( ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై: డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేటీఎంకు భారీ షాక్ తగిలింది. వేల కోట్ల రూపాయల సమీకరణ నిమిత్తం త్వరలో ఐపీవోకు రానున్న తరుణంలో అయిదుగురు కీలక ఎగ్జిక్యూటివ్‌లు సంస్థకు గుడ్ బై చెప్పారు. పేటీఎం అధ్యక్షుడు అమిత్ నాయర్, మరో 4 గురు సీనియర్ అధికారులు ఐపీఓకు ముందు తమ పదవులకు రాజీనామా చేయడం పరిశ్రమ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని పేటీఎంకు ఇప్పటిదాకా ఐదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు గుడ్‌బై చెప్పారు. తాజాగా పేటీఎం అధ్యక్షుడు అమిత్ నాయర్ పదవినుంచి తప్పకున్నారు. మాజీ గోల్డ్‌మన్ సాచ్స్ ఎగ్జిక్యూటివ్ అయిన నయ్యర్ 2019లో పేటీఎం బోర్డులో చేరారు. పేటీఎం ఆర్థిక అనుబంధ సంస్థను నిర్మించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. బోర్డు నయ్యర్ రాజీనామాను బోర్డు ఇప్పటికే అంగీకరించినట్టు తెలుస్తోంది.
చీఫ్ హెచ్ ఆర్ ఆఫీసర్ రోహిత్ ఠాకూర్ ఇప్పటికే సంస్థకు గుడ్‌బై చెప్పగా, మరో ముగ్గురు ఉపాధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేయడం గమనార్హం. ఈ జాబితాలో చీఫ్ బిజినెస్ ఆఫీసర్, యూజర్ గ్రోత్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ వీర్, పేటీఎం మార్కెటింగ్హెడ్ జస్కరన్ సింగ్ కపానీ ఉన్నారు. గతంలో యాక్సెంచర్‌లో హెచ్‌ఆర్ హెడ్‌గా, మైక్రోసాఫ్ట్, జీఈలో నాయకత్వ పాత్రల్లో పనిచేసిన ఠాకూర్ కూడా తప్పుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, జస్కరన్ సింగ్ కపానీ దాదాపు ఆరు సంవత్సరాల తరువాత సంస్థను విడిచిపెట్టి, షావోమి ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా చేరారు. ప్రస్తుతం, పేటీఎం మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ కుమార్ పనిచేస్తున్నారు. అలాగే పేటీఎం ఫస్ట్ హెడ్, పేటీఎం మనీ సీఈఓ, పేటీఎంమాల్ సీఎఫ్‌ఓ సంస్థ నుంచి వైదొలిగిన ఏడాది తర్వాత హై-ప్రొఫైల్ నిష్క్రమణలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలపై పరిశ్రమ పరిశీలకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పేటీఎం దాఖలు చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, పేటీఎం బోర్డులో ఇటీవల మార్పులు జరిగాయి. ప్రధానంగా చైనాకు చెందిన బోర్డు సభ్యులు తప్పు కున్నారు. అలిపే ప్రతినిధి జింగ్ జియాండాంగ్, యాంట్ ఫైనాన్షియల్ గుమింగ్ చెంగ్, అలీబాబా ప్రతినిధులు మైఖేల్ యుయెన్ జెన్ యావో (యుఎస్ పౌరుడు), టింగ్ హాంగ్ కెన్నీ హో బోర్డునుంచి నిష్క్రమించారు. మరోవైపు సామా క్యాపిటల్ అషిత్ రంజిత్ లిలానీ, సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధి వికాస్ అగ్నిహోత్రి,అమెరికా పౌరుడు డౌగ్లస్ ఫీజిన్ యాంట్ గ్రూప్ తరపున పేటీఎం బోర్డు డైరెక్టర్లలో చేరారు. అయితే పేటీఎం వాటాదారుల్లో మార్పులు లేవని కంపెనీ ప్రకటించింది. ఈ రాజీనామాలపై వ్యాఖ్యానించేందుకు పేటీఎం నిరాకరించింది. కాగా పేటీఎం 2.3 బిలియన్ డాలర్ల విలువైన ఐపీఓకు డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment