పెట్రోనెట్‌ భారీ పెట్టుబడులు Petronet to invest Rs 40,000 cr in next 4-5 years | Sakshi
Sakshi News home page

పెట్రోనెట్‌ భారీ పెట్టుబడులు

Published Fri, Feb 11 2022 6:25 AM

Petronet to invest Rs 40,000 cr in next 4-5 years - Sakshi

న్యూఢిల్లీ: ద్రవ రూపంలోని సహజ వాయువు (లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌/ఎల్‌ఎన్‌జీ) తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ వచ్చే 4–5 ఏళ్లలో రూ.40,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. విదేశాల్లోని ప్లాంట్లపై కలిపి ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు సంస్థ సీఈవో ఏకే సింగ్‌ వెల్లడించారు. ’’పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ రూ.12,500 కోట్లతో ప్రొపేన్‌ డీహైడ్రోజెనరేషన్‌ ప్లాంట్‌ ఏర్పాటు ద్వారా పెట్రోకెమికల్స్‌ వ్యాపారంలోకి ప్రవేశించనుంది. దిగుమతి చేసుకున్న ముడి సరుకు నుంచి ప్రాపీలేన్‌ను ఈ ప్లాంట్‌ తయారు చేస్తుంది. అలాగే, ఒడిశాలోని గోపాల్‌పూర్‌ వద్ద రూ.1,600 కోట్లతో ఎల్‌ఎన్‌జీ దిగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాం’’ అని సింగ్‌ తెలిపారు.

తాము ఎప్పటికప్పుడు విదేశీ పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తుంటామని, దేశానికి ప్రయోజనకరం, మెరుగైనది అనిపిస్తే తప్పకుండా ముందుకు వెళతామని చెప్పారు. విద్యుత్, ఫెర్టిలైజర్, సీఎన్‌జీ అవసరాలను దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజవాయువు సగం మేరే తీరుస్తోంది. మిగిలినది దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ‘‘రూ.600 కోట్లతో గుజరాత్‌లోని దహేజ్‌ ఎల్‌ఎన్‌జీ దిగుమతి టర్మినల్‌ సామర్థ్యాన్ని ప్రస్తుత 17.5 మిలియన్‌ టన్నుల (వార్షిక) నుంచి 22.5 మిలియన్‌ టన్నులకు పెంచుకుంటాం. రూ.1,245 కోట్లతో అదనపు స్టోరేజీ ట్యాంకు సమకూర్చుకుంటాం’’ అని సింగ్‌ తెలిపారు. దేశీయంగా ఎల్‌ఎన్‌జీ దిగుమతి సామర్థ్యం, పెట్రోకెమికల్‌ వ్యాపారం కోసం ∙రూ.17,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement