భారత డిజిటల్ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే తెరతీసింది. తాజాగా ఫోన్‌పే ఇండస్ యాప్‌స్టోర్‌ను దిల్లీ వేదికగా బుధవారం ఆవిష్కరించింది. 45 విభాగాల్లో 2 లక్షలకుపైగా యాప్స్, గేమ్స్‌ను ఈ యాప్‌స్టోర్‌లో పొందుపరిచింది.
తెలుగు, ఇంగ్లిష్, హిందీ సహా 12 భాషల్లో వినియోగదారులు తమకు కావాల్సిన యాప్స్‌ను ఇందులో సర్చ్ చేయవచ్చు. ఇన్-యాప్ కొనుగోళ్లపై గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్‌స్టోర్‌లు 15-30% వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. అయితే డెవలపర్లు 2025 ఏప్రిల్ 1 వరకు యాప్ లిస్టింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. తర్వాత ఇన్–యాప్ బిల్లింగ్ కోసం తమకు నచ్చిన థర్డ్‌పార్టీ పేమెంట్ గేట్‌వేను ఎంచుకునే వెసులుబాటును తీసుకొచ్చారు.
ఫోన్‌పే యాప్ లేదా ఇండస్‌యాప్‌స్టోర్.కామ్ నుంచి ఇండస్ యాప్‌స్టోర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ‘మొబైల్ యాప్ మార్కెట్‌లో మరింత పోటీకి ఈ యాప్‌స్టోర్ నాంది పలికింది. ఇది మరింత శక్తివంతమైన భారతీయ డిజిటల్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో సహాయపడుతుంది’ అని ఫోన్‌పే సీఈవో, ఫౌండర్ సమీర్ నిగమ్ తెలిపారు.
ఇదీ చదవండి: పూర్తి మహిళా సిబ్బందితో కార్యకలాపాలు.. ఎక్కడో తెలుసా..
ఇ-మెయిల్ ఖాతాతో సంబంధం లేకుండా మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యే విధానాన్ని ఈ యాప్ స్టోర్ తీసుకొచ్చింది. ఇప్పటికే నోకియా, లావా వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2023లో మొబైల్ యాప్‌లపై 1.19 లక్షల కోట్ల గంటలను భారతీయులు గడిపినట్లు కొన్ని సర్వేల ద్వారా తెలిసింది. 2021లో నమోదైన 95,400 కోట్ల గంటలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. యాప్‌ల డౌన్‌లోడ్‌ల విషయంలో ప్రపంచంలోనే మనదేశం అతిపెద్ద మార్కెట్ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment