![Pilot cancels takeoff after IndiGo passenger says he COVID positive - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/6/indigo.jpg.webp?itok=MUsxjU5Z)
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనావైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందన్న ఆందోళన మధ్య ఒక విమాన ప్రయాణికుడి నిర్లక్ష్య వైఖరి కలకలం రేపింది. విమానం మరికొద్ది నిమిషాల్లో టేకాఫ్ తీసుకుంటుందనగా తనకు కరోనా పాజిటివ్ అంటూ ప్రయాణికుడు బాంబు పేల్చాడు. దీంతో హతాశులైన విమాన సిబ్బంది వెంటనే విమానాన్ని నిలిపి వేసి, అధికారులకు సమాచారమిచ్చారు. ఢిల్లీ నుండి పూణే బయలుదేరిన ఇండిగో 6ఇ -286 విమానంలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. విమానం గాల్లోకి ఎగిరేందుకు (టేకాఫ్)సిద్ధమవుతుండగా తనకు కరోనా పాజిటివ్ అని చెప్పడంతో తోటి ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే స్పందించిన సిబ్బంది విమానాన్ని వెనక్కి మళ్లించి, పైలట్ గ్రౌండ్ కంట్రోలర్స్‌కు పరిస్థితిని వివరించారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించిన సదరు ప్రయాణికుడిని అంబులెన్స్ ద్వారా దక్షిణ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలోని కోవిడ్ సెంటర్‌కు తరలించారు అధికారులు. ఆ తరువాత ప్రయాణికులందరికీ పరీక్షలు నిర్వహించి, ఎవరికీ పాజిటివ్ రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. విమానం మొత్తం శానిటైజ్ చేసిన తరువాత సుమారు గంటన్నర ఆలస్యంగా విమానం మళ్లీ గాల్లోకి ఎగిరింది. అలాగే ప్రయాణీకులందర్నీ స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా సూచించారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.
కాగా కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో విమానయాన రంగం ఒకటి. గత ఏడాది మార్చి నుంచి జాతీయ,అంతర్జాతీయ విమాన సేవలు రద్దయ్యాయి. కోవిడ్-19 తగ్గుముఖం పట్టడంతో కోవిడ్‌ప్రత్యేక నిబంధనలతో దేశీయంగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైనాయి. కానీ అంతర్జాతీయంగా మళ్లీ కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయ వాణిజ్య విమానాల నిషేధాన్ని డీజీసీఏ మార్చి 31, 2021 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment