బాస్మతీయేతర బియ్యంపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు మంత్రుల బృందం సమావేశం కానున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. డిమాండ్-సరఫరా, ధరల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని చర్చలు జరుగుతాయని ఫిక్కీ నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘బస్మతియేతర బియ్యం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలనే డిమాండ్ ఉంది. మంత్రుల బృందంతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటాం. వ్యవసాయ ఉత్పత్తులు, వినియోగ విధానాలు, రిటైల్, హోల్‌సేల్ మార్కెట్‌లో ధరలు..వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని సహేతుక నిర్ణయం వెల్లడిస్తాం. నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి భారతీయ ఎగుమతి విధానాలపై వ్యాపారులకు సరైన అవగాహన ఉంది. దేశంలో ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విలువ 56 బిలియన్ డాలర్లు(రూ.4.6 లక్షల కోట్లు)కు చేరుకుంది. భారత్ ఎగుమతి చేస్తున్న కొన్ని ఉత్పత్తుల్లో సమస్యలున్నట్లు ఆరోపణలున్నాయి. వాటిని పరిష్కరించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) పనిచేస్తోంది’ అన్నారు.
ఇదీ చదవండి: అతిథుల కోసం 3 ఫాల్కన్ జెట్‌లు, 100 విమానాలు
దేశీయంగా సరఫరాను పెంచడానికి జులై 20, 2023 నుంచి బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించారు. దాంతో స్థానికంగా బియ్యం పండిస్తున్న రైతులకు సరైన ధరలు లభించడం లేదనే వాదనలున్నాయి. రైతులు, వ్యాపారులు బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలని కోరుతున్నారు. దాంతో ప్రభుత్వం మంత్రుల బృందంతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఉప్పుడు బియ్యం(పార్‌బాయిల్డ్ రైస్)పై ఎగుమతి సుంకాన్ని టన్నుకు 100 డాలర్లు(రూ.8,300)గా నిర్ణయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ వెరైటీ బియ్యంపై ప్రస్తుతం 20 శాతం ఎగుమతి సుంకాన్ని వసూలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment