
న్యూఢిల్లీ: సామాన్య ప్రజానీకానికి ఆర్థిక సాధికారత కల్పించే దిశగా ఫిన్‌టెక్ విప్లవాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఫిన్‌టెక్ రంగం భారీ స్థాయిలో విస్తరించిందని, ప్రజల్లోనూ ఆమోదయోగ్యత పొందిందని శుక్రవారం ఇన్ఫినిటీ ఫోరం సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన తెలిపారు. ‘ఇప్పుడు ఈ ఫిన్‌టెక్ ఆవిష్కరణలను ఫిన్‌టెక్ విప్లవంగా మల్చుకోవాల్సిన సమయం వచ్చింది. దేశంలోని ప్రతి పౌరుడికి ఆర్థిక సాధికారత కల్పించేందుకు ఈ విప్లవం తోడ్పడాలి‘ అని ప్రధాని చెప్పారు.
ఆర్థిక రంగంలో టెక్నాలజీ గణనీయంగా మార్పులు తెస్తోందని, గతేడాది మొబైల్ ద్వారా చెల్లింపులు .. ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రాయల్స్‌కు మించి జరిగాయని పేర్కొన్నారు. అలాగే భౌతికంగా శాఖలు లేని పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకులు ఇప్పటికే వచ్చేశాయని, భవిష్యత్తులో ఇవి సర్వసాధారణంగా మారగలవని మోదీ వివరించారు. టెక్నాలజీ వినియోగంలో ఇతర దేశాలకేమీ తీసిపోమని భారత్ నిరూపించిందని ఆయన చెప్పారు. డిజిటల్ ఇండియా నినాదం కింద చేపట్టిన వివిధ చర్యలతో.. పాలనలో నూతన ఫిన్‌టెక్ పరిష్కార మార్గాలను ఉపయోగించేందుకు ద్వారాలు తెరుచుకున్నాయని మోదీ పేర్కొన్నారు.
ఆ నాలుగు కీలకం..: ఫిన్‌టెక్ విప్లవమనేది .. ఆదాయం, పెట్టుబడులు, బీమా, సంస్థాగత రుణాలు అనే నాలుగు స్తంభాలపై ఆధారపడి ఉందని మోదీ చెప్పారు. యూపీఐ, రూపే వంటి సాధనాలు ప్రతీ దేశానికీ ఉపయోగపడేవేనన్నారు.
సమిష్టిగా టెక్నాలజీ నియంత్రణ: ఆర్థిక మంత్రి
ఎప్పటికప్పుడు మారిపోతున్న టెక్నాలజీని, టెక్ ఆధారిత పేమెంట్ వ్యవస్థలను సమర్ధమంతంగా నియంత్రించేందుకు అంతర్జాతీయ స్థాయిలో సమిష్టి కృషి అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రస్తుతం కొత్త టెక్నాలజీల నియంత్రణ విషయంలో ప్రత్యేక ఫార్ములా అంటూ లేదని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా టెక్నాలజీలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఇన్ఫినిటీ ఫోరం సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment