వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 258 పాయింట్లు జంప్‌చేసి 38,309కు చేరగా.. నిఫ్టీ 86 పాయింట్లు ఎగసి 11,333 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణ వార్తలతో పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క కోల్‌కతా మెట్రో ప్రాజెక్ట్ గెలుచుకున్నట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల సంస్థ జీపీటీ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ సైతం జోరు చూపుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం
పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్
ప్రిఫరెన్షియల్, రైట్స్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణకు ప్రతిపాదించినట్లు ఇప్పటికే పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ వెల్లడించింది. ఈ ప్రతిపాదనపై బుధవారం(19న) సమావేశంకానున్న బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్లు తాజాగా తెలియజేసింది. ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ. 600 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 12 శాతం వరకూ దూసుకెళ్లింది. రూ. 270ను అధిగమించింది. ప్రస్తుతం 10 శాతం లాభంతో రూ. 265 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే ఈ కౌంటర్లో ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో 19 లక్షలకుపైగా షేర్లు చేతులు మారడం గమనార్హం!
జీపీటీ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్
పీఎస్‌యూ రైల్వే వికాస్ నిగమ్.. కోల్‌కతా నుంచి రూ. 196 కోట్లకుపైగా విలువైన కాంట్రాక్టు లభించినట్లు జీపీటీ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ తాజాగా పేర్కొంది. కాంట్రాక్టులో భాగంగా మెట్రో రైల్వే వయాడక్ట్‌సహా.. రెండు రైల్వే స్టేషన్ల అభివృద్ధిని సైతం చేపట్టవలసి ఉంటుందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో జీపీటీ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 12 శాతం వరకూ దూసుకెళ్లింది. రూ. 31ను అధిగమించింది. ప్రస్తుతం 9 శాతం జంప్‌చేసి రూ. 30 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment