న్యూఢిల్లీ: విద్యుత్ ట్రేడింగ్ సొల్యూషన్ల కంపెనీ పీటీసీ ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 157 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 50 కోట్లు మాత్రమే ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 5.80 చొప్పున డివిడెండును ప్రకటించింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,926 కోట్ల నుంచి రూ. 3,107 కోట్లకు క్షీణించింది.
మొత్తం వ్యయాలు సైతం రూ. 3,793 కోట్ల నుంచి రూ. 2,891 కోట్లకు తగ్గాయి. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 458 కోట్ల నుంచి రూ. 552 కోట్లకు జంప్ చేసింది. అయితే మొత్తం ఆదాయం రూ. 18,374 కోట్ల నుంచి రూ. 16,880 కోట్లకు నీరసించింది. కాగా.. గతేడాది మధ్యలోనే షేరుకి రూ. 2 చొప్పున మధ్యంతర డివిడెండును చెల్లించింది. వెరసి మొత్తం రూ. 7.80 డివిడెండు చెల్లించినట్లయ్యింది. కంపెనీ ఈ ఏడాది(2022–23) జూన్ త్రైమాసిక ఫలితాలను సైతం ఆలస్యంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఈలో పీటీసీ ఇండియా షేరు 1.1 శాతం లాభపడి రూ. 85 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment