PTC India
-
ఓఎన్జీసీ చేతికి పీటీసీ ఎనర్జీ
న్యూఢిల్లీ: పవర్ ట్రేడింగ్ సొల్యూషన్స్ సంస్థ పీటీసీ ఇండియా తమ అనుబంధ సంస్థ పీటీసీ ఎనర్జీలో పూర్తి వాటాలను ప్రభుత్వ రంగ ఓఎన్జీసీకి విక్రయించనుంది. ఇందుకోసం సంస్థ విలువను రూ. 2,021 కోట్లుగా లెక్కగట్టినట్లు సంస్థ తెలిపింది. పీటీసీ ఎనర్జీలో 100 శాతం వాటాల కొనుగోలు కోసం ఓఎన్జీసీ రూ. 925 కోట్లు నగదు చెల్లించేందుకు బిడ్‌ను దాఖలు చేసిందని, దీని ప్రకారం సంస్థ విలువ రూ. 2,021 కోట్లుగా (రుణాలు, ఈక్విటీ విలువ మొదలైనవన్నీ కలిపి) ఉంటుందని పీటీసీ ఇండియా తెలిపింది. మిగతా బిడ్డర్లతో పోలిస్తే ఓఎన్జీసీ అత్యధికంగా బిడ్ చేయడంతో దాన్ని ఎంపిక చేసినట్లు వివరించింది. సంబంధిత నిబంధనలు, షేర్‌హోల్డర్ల ఆమోదం మేరకు ఈ ఒప్పందం ఉంటుందని సంస్థ పేర్కొంది. 2008లో ఏర్పాటైన పీఈఎల్ .. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో 288.8 మెగావాట్ల సామర్ధ్యంతో ఏడు పవన విద్యుత్ ప్రాజెక్టులను నెలకొలి్పంది. -
పీటీసీ ఇండియా తుది డివిడెండ్
న్యూఢిల్లీ: విద్యుత్ రంగ ప్రభుత్వ దిగ్గజం పీటీసీ ఇండియా గత ఆర్థిక సంవత్సరాని(2021–22)కి తుది డివిడెండును ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 5.80 చొప్పున చెల్లించనుంది. ఇందుకు వాటాదారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తాజాగా తెలియజేసింది. కంపెనీ ఇప్పటికే షేరుకి రూ. 2 చొప్పున మధ్యంతర డివిడెండును చెల్లించింది. డిసెంబర్ 30న జరిగిన సాధారణ వార్షిక సమావేశంలో తుది డివిడెండుకు అనుమతి లభించినట్లు వెల్లడించింది. కాగా.. వర్ధమాన విభాగాలైన గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌లో గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలతో చేతులు కలపడం ద్వారా అవకాశాలను అన్వేషిస్తున్నట్లు కంపెనీ సీఎండీ రజిబ్ కె.మిశ్రా వివరించారు. మార్చితో ముగిసిన గతేడాది కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 552 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2020–21) రూ. 458 కోట్ల లాభం నమోదైంది. ఈ కాలంలో 9.3 శాతం అధికంగా 87.5 బిలియన్ యూనిట్ల రికార్డ్ పరిమాణాన్ని సాధించినట్లు పీటీసీ ఇండియా తెలియజేసింది. ఎన్ఎస్ఈలో పీటీసీ ఇండియా షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 85 వద్ద ముగిసింది. -
పీటీసీ ఇండియా లాభం హైజంప్
న్యూఢిల్లీ: విద్యుత్ ట్రేడింగ్ సొల్యూషన్ల కంపెనీ పీటీసీ ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 157 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 50 కోట్లు మాత్రమే ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 5.80 చొప్పున డివిడెండును ప్రకటించింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,926 కోట్ల నుంచి రూ. 3,107 కోట్లకు క్షీణించింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 3,793 కోట్ల నుంచి రూ. 2,891 కోట్లకు తగ్గాయి. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 458 కోట్ల నుంచి రూ. 552 కోట్లకు జంప్ చేసింది. అయితే మొత్తం ఆదాయం రూ. 18,374 కోట్ల నుంచి రూ. 16,880 కోట్లకు నీరసించింది. కాగా.. గతేడాది మధ్యలోనే షేరుకి రూ. 2 చొప్పున మధ్యంతర డివిడెండును చెల్లించింది. వెరసి మొత్తం రూ. 7.80 డివిడెండు చెల్లించినట్లయ్యింది. కంపెనీ ఈ ఏడాది(2022–23) జూన్ త్రైమాసిక ఫలితాలను సైతం ఆలస్యంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఎన్ఎస్ఈలో పీటీసీ ఇండియా షేరు 1.1 శాతం లాభపడి రూ. 85 వద్ద ముగిసింది. -
పీటీసీ ఇండియా ఆదాయం 325 కోట్లు
న్యూఢిల్లీ: పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ (పీఎఫ్ఎస్) కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 23 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.72 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.56 కోట్లకు తగ్గిందని పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.300 కోట్ల నుంచి రూ.325 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్డీ, సీఈఓ అశోక్ హల్దియా చెప్పారు. తాము ఇచ్చిన రుణాలు 22 శాతం వృద్ధితో రూ.13,361కు పెరిగాయని తెలిపారు. నికర వడ్డీ ఆదాయం రూ.90 కోట్లని, ఇది మొత్తం వడ్డీ ఆదాయంలో 30 శాతమని వివరించారు. ఒత్తిడి రుణాలు పరిష్కారమయ్యే దిశలో ఉన్నాయని, వివిధ మార్గాల ద్వారా ఒత్తిడి రుణాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా పూర్తి పరిష్కారం కనుగొనగలమని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో పీఎఫ్ఎస్ షేర్ 6 శాతం లాభంతో రూ.19 వద్ద ముగిసింది. -
పీటీసీ ఇండియా
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.58 టార్గెట్ ధర: రూ.76 ఎందుకంటే: భారత్‌లో అగ్రశ్రేణి విద్యుత్ ట్రేడింగ్ కంపెనీ. భారీ విద్యుత్ ప్రాజెక్టులకు ఊతాన్నిచ్చే ఉద్దేశంతో 1999లో ఏర్పాటు చేశారు. రిబేట్/సర్‌చార్జీ ఆదాయం కారణంగా క్యూ3 ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం రూ.2,750 కోట్లకు, నికర లాభం రూ.91 కోట్లకు పెరిగాయి. గతేడాది చివరి నాటికి నగదు నిల్వలు రూ.800 కోట్లుగా ఉన్నాయి. రిబేట్/సర్‌చార్జీ ఆదాయం పెరుగుతుండడం, అమ్మకాల పరిమాణం వృద్ధి చెందుతుండడం, ఇతర ఆదాయం అధికంగా ఉండడం డిస్కమ్‌ల నుంచి నగదు వసూళ్లు పెరుగుతుండడం వంటి కారణాల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 57 శాతం వృద్ధితో రూ. 310 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. రాష్ట్రాల మధ్య విద్యుత్ ప్రసారానికి అనుమతించడం, కొత్త పవర్ ప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభించడం, అంతరాష్ట్ర గ్రిడ్ అనుసంధానానికి ఆటంకాలు తొలగుతుండడం వంటి కారణాల వల్ల కంపెనీ మార్కెట్ విస్తృతం అవుతోంది. రాష్ట్రాల విద్యుత్ బోర్డ్‌ల ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, విద్యుత్ సంబంధిత నిబంధనలు మారే అవకాశలు, స్వల్పకాలిక మార్కెట్లో పోటీ పెరుగుతుండడం ప్రభా వం చూపించే అంశాలు.