
న్యూఢిల్లీ: విద్యుత్ రంగ ప్రభుత్వ దిగ్గజం పీటీసీ ఇండియా గత ఆర్థిక సంవత్సరాని(2021–22)కి తుది డివిడెండును ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 5.80 చొప్పున చెల్లించనుంది. ఇందుకు వాటాదారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తాజాగా తెలియజేసింది. కంపెనీ ఇప్పటికే షేరుకి రూ. 2 చొప్పున మధ్యంతర డివిడెండును చెల్లించింది. డిసెంబర్ 30న జరిగిన సాధారణ వార్షిక సమావేశంలో తుది డివిడెండుకు అనుమతి లభించినట్లు వెల్లడించింది.
కాగా.. వర్ధమాన విభాగాలైన గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌లో గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలతో చేతులు కలపడం ద్వారా అవకాశాలను అన్వేషిస్తున్నట్లు కంపెనీ సీఎండీ రజిబ్ కె.మిశ్రా వివరించారు. మార్చితో ముగిసిన గతేడాది కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 552 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2020–21) రూ. 458 కోట్ల లాభం నమోదైంది. ఈ కాలంలో 9.3 శాతం అధికంగా 87.5 బిలియన్ యూనిట్ల రికార్డ్ పరిమాణాన్ని సాధించినట్లు పీటీసీ ఇండియా తెలియజేసింది.
ఎన్‌ఎస్‌ఈలో పీటీసీ ఇండియా షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 85 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment