Last financial year
-
జీడీపీ గణాంకాలపైనే దృష్టి
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఆధారపడి కదలనున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2022–23)తోపాటు చివరి త్రైమాసిక(జనవరి–మార్చి) స్థూల దేశీయోత్పత్తి గణాంకాలను ప్రభుత్వం ఈ నెల 31న విడుదల చేయనుంది. పూర్తి ఏడాదికి ప్రొవిజనల్ గణాంకాలు వెల్లడికానున్నాయి. వీటికితోడు మే నెల ఆటో రంగ విక్రయాలు, తయారీ రంగ గణాంకాలు(పీఎంఐ) సైతం విడుదల కానున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ప్రధానంగా క్యూ4 జీడీపీ, ఆటో విక్రయాలపై దృష్టి పెట్టనునన్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఫలితాల స్పీడ్ ఇప్పటికే గతేడాది క్యూ4(జనవరి–మార్చి) ఫలితాల సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ బాటలో వారాంతాన ఓఎన్జీసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పీటీసీ, అరబిందో ఫార్మా, బాలకృష్ణ ఇండస్ట్రీస్ క్యూ4 పనితీరు వెల్లడించాయి. ఈ బాటలో అదానీ ట్రాన్స్మిషన్, క్యాపంస్ యాక్టివ్‌వేర్, ఇప్కా ల్యాబొరేటరీస్, డీసీఎం, ఐఆర్సీటీసీ, జిందాల్ పాలీఫిల్మŠస్, జూబిలెంట్ ఫార్మోవా, నాట్కో ఫార్మా, ఎన్బీసీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్ఐఐటీ, రైల్ వికాస్ నిగమ్, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్ తదితరాలు క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఇతర అంశాలు తొలుత విడుదలైన రుతుపవన అంచనాల ప్రకారం ఈ ఏడాది సాధారణ వర్షపాతానికి వీలుంది. ఇకపై వెలువడనున్న రుతుపవన తాజా అంచనాలు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల తీరు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంట అంశాలు సైతం మార్కెట్లో ట్రెండ్‌ను నిర్దేశించగలవని విశ్లేషకులు వివరించారు. కాగా.. అమెరికా రుణ పరిమితి పెంపు అంశంపై ఈ వారం మరిన్ని చర్చలకు తెరలేవనుంది. గడువు ముగిసేలోగా ఇందుకు అనుమతి పొందాలని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. రుణ పరిమితి పెంపు 31.2 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. గత వారం ఇలా.. పలు ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు పటిష్ట లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 772 పాయింట్లు జమ చేసుకుని తిరిగి 62,000 పాయింట్ల ఎగువన 62,502కు చేరింది. నిఫ్టీ 296 పాయింట్లు ఎగసి 18,499 వద్ద స్థిరపడింది. ఈ బాటలో బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ మరింత అధికంగా 2.5 శాతం జంప్‌చేయగా.. స్మాల్ క్యాప్ 1.4 శాతం బలపడింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు రూ. 37,317 కోట్ల పెట్టుబడులు కొద్ది రోజులుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌పట్ల ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ(మే 2–26) నికరంగా రూ. 37,317 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇది గత ఆరు నెలల్లోనే అత్యధికంకాగా.. స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండటం, ఆకర్షణీయ స్థాయికి చేరిన షేర్ల ధరలు వంటి అంశాలు ఇందుకు కారణమవుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఇంతక్రితం ఎఫ్‌పీఐలు 2022 నవంబర్‌లో మాత్రమే ఈ స్థాయిలో రూ. 36,239 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఈ బాటలో 2023 ఏప్రిల్‌లో రూ. 11,630 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. మార్చిలో రూ. 7,936 కోట్ల విలువైన స్టాక్స్ సొంతం చేసుకున్నారు. అయితే 2023 జనవరి, ఫిబ్రవరిలలో ఎఫ్‌పీఐలు మొత్తం రూ. 34,000 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టడం గమనార్హం! -
వొడాఫోన్ ఐడియా నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర నష్టాలు తగ్గి రూ. 6,419 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది (2021–22) ఇదే కాలంలో రూ. 6,513 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 3 శాతం పుంజుకుని రూ. 10,507 కోట్లకు చేరింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం పెరిగి రూ. 29,298 కోట్లను తాకింది. 2021–22లో రూ. 28,234 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 38,490 కోట్ల నుంచి రూ. 42,134 కోట్లకు బలపడింది. క్యూ4లో వెచ్చించిన రూ. 560 కోట్లతో కలిపి గతేడాదిలో పెట్టుబడి వ్యయాలు రూ. 3,360 కోట్లకు చేరాయి. 2022 డిసెంబర్‌కల్లా రూ. 2,28,890 కోట్లుగా నమోదైన స్థూల రుణభారం మార్చికల్లా రూ.2,09,260 కోట్లకు తగ్గింది. క్యూ4లో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 124 నుంచి బలపడి రూ. 135ను తాకింది. సబ్స్క్రయిబర్ల సంఖ్య 7 శాతం తగ్గి 22.59 కోట్లకు చేరింది. కంపెనీలో ప్రభుత్వ వాటా 33.1 శాతంగా నమోదైంది. స్పెక్ట్రమ్ వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై వడ్డీని ఈక్విటీగా మార్పుచేసి ప్రభుత్వానికి జారీ చేయడంతో రుణ భారం తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది. వొడాఫోన్ ఐడియా షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం బలపడి రూ. 7 వద్ద ముగిసింది. -
కంప్యూటర్ సేవల ఎగుమతుల్లో భారత్ జూమ్!
ముంబై: ప్రపంచ కంప్యూటర్ సేవల ఎగుమతుల్లో భారత్ వాటా మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) దాదాపు 11 శాతానికి పెరిగిందని ఆర్థిక సేవల దిగ్గజం– డీబీఎస్ ఒక విశ్లేషణలో తెలిపింది. సాఫ్ట్వేర్ ఎగుమతులు రికా ర్డు స్థాయిలో 320 బిలియన్ డాలర్లకు చేరడం ఇందుకు దోహదపడినట్లు వివరించింది. 2021–22లో ఈ విలువ 255 బిలియన్ డాలర్లు. డీబీఎస్ సీనియ ర్ ఎకనమిస్ట్ రాధికా రావు ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2022–23 ట్రేడ్ డేటా విశ్లేషణ ప్రకారం, మొత్తం సేవల ఎగుమతి వాటాలో దేశం ఇప్పటికీ వెనుకబడి ఉంది. ఈ విభాగంలో మొత్తం భారత్ వాటా దాదాపు 4%మే. ► సేవల వాణిజ్యం పనితీరు పనితీరు పటిష్టంగా ఉంది. అంతర్జాతీయ ఫైనాన్షియల్ అంశాల్లో పటిష్టతకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా కలిసిన వచ్చే అంశం ఇది. కమోడిటీ ధరలు తగ్గడం కూడా భారత్‌కు విదేశీ మారకం పరంగా సానుకూలత కల్పిస్తోంది. ► 2022–23లో సాఫ్ట్వేర్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 320 బిలియన్ డాలర్లకు చేరగా, సర్వీసెస్ ట్రేడ్ మిగులు 142 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021–22తో పోల్చితే, ఈ విలువ 30 శాతం పెరిగింది. సర్వీసెస్ దిగుమతులు కూడా భారీగా పెరగడం దీనికి నేపథ్యం. ► వస్తు, సేవలు కలిపి 2022–23లో ఎగుమతులు కొత్త రికార్డులో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో 770 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒక్క సేవల ఎగుమతులు చూస్తే, 27.16 శాతం పెరిగి 323 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక మొత్తం దిగుమతులు 17 శాతం పెరిగి 892 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ► కంప్యూటర్ సేవల ఎగుమతులు పటిష్ట స్థాయిలో ఉండడం కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2% లోపు (2022–23 జీడీపీలో) కట్టడిలో ఉండడానికి కారణం. ► బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కింద సేవల ట్రేడ్ వాటా 2019లో 3 శాతం (జీడీపీలో) ఉంటే, 2022 నాటికి ఇది 4.6 శాతానికి ఎగసింది. 2023లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ► సేవల ఎగుమతి పెరుగుదల్లో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికం సంబంధిత రంగాలు పటిష్టంగా ఉన్నాయి. మొత్తం సేవల ఎగుమతులలో వీటి వాటా దాదాపు సగం ఉంది ► సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో అమెరికా 55.5% వాటాతో అగ్ర స్థానంలో ఉంటే, యూరప్ తరువాతి స్థానంలో ఉంది. ఇందులో బ్రిటన్‌ది మొదటి స్థానం. -
పీటీసీ ఇండియా లాభం హైజంప్
న్యూఢిల్లీ: విద్యుత్ ట్రేడింగ్ సొల్యూషన్ల కంపెనీ పీటీసీ ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 157 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 50 కోట్లు మాత్రమే ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 5.80 చొప్పున డివిడెండును ప్రకటించింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,926 కోట్ల నుంచి రూ. 3,107 కోట్లకు క్షీణించింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 3,793 కోట్ల నుంచి రూ. 2,891 కోట్లకు తగ్గాయి. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 458 కోట్ల నుంచి రూ. 552 కోట్లకు జంప్ చేసింది. అయితే మొత్తం ఆదాయం రూ. 18,374 కోట్ల నుంచి రూ. 16,880 కోట్లకు నీరసించింది. కాగా.. గతేడాది మధ్యలోనే షేరుకి రూ. 2 చొప్పున మధ్యంతర డివిడెండును చెల్లించింది. వెరసి మొత్తం రూ. 7.80 డివిడెండు చెల్లించినట్లయ్యింది. కంపెనీ ఈ ఏడాది(2022–23) జూన్ త్రైమాసిక ఫలితాలను సైతం ఆలస్యంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఎన్ఎస్ఈలో పీటీసీ ఇండియా షేరు 1.1 శాతం లాభపడి రూ. 85 వద్ద ముగిసింది. -
ఏప్రిల్‌లో పుంజుకున్న ఎల్ఐసీ వ్యాపారం
ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో కాస్త నెమ్మదించిన ఎల్ఐసీ బీమా వ్యాపారం.. మళ్లీ పుంజుకుంటోంది. ఈ ఏడాది(2015-16) ఏప్రిల్‌లో ఎల్ఐసీ బీమా ప్రీమియం ఆదాయం 21 శాతం ఎగబాకగా.. కొత్త పాలసీ అమ్మకాల సంఖ్య కూడా 18 శాతం పెరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తాజా గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఏప్రిలో ప్రీమియం రూపంలో రూ.3,582 కోట్లను ఎల్ఐసీ వసూలు చేసింది. గతేడాది ఇదే నెలలో ఈ మొత్తం రూ.2,966 కోట్లు మాత్రమే. కాగా, పాలసీ అమ్మకాల సంఖ్య కూడా 7,14,572 నుంచి 8,43,235కు పెరిగింది. ఇదిలాఉండగా... తొలి ఏడాది బీమా ప్రీమియం ఆదాయం రూపంలో ఎల్ఐసీ మార్కెట్ వాటా ఏప్రిల్‌లో 68 శాతానికి తగ్గడం గమనార్హం. 2013-14లో ఎల్ఐసీ మార్కెట్ వాటా 75 శాతంకాగా, 2014-15లో 5 శాతం మేర తగ్గి 70 శాతానికి పడిపోయింది. కాగా, గతేడాది ప్రీమియం వసూళ్లు 14 శాతం క్షీణించి రూ.78,308 కోట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఈ వసూళ్ల మొత్తం రూ.90,645 కోట్లు.