జీడీపీ గణాంకాలపైనే దృష్టి | Market experts say that the focus will be on Q4 GDP and auto sales | Sakshi
Sakshi News home page

జీడీపీ గణాంకాలపైనే దృష్టి

Published Mon, May 29 2023 4:36 AM | Last Updated on Mon, May 29 2023 4:36 AM

Market experts say that the focus will be on Q4 GDP and auto sales - Sakshi

న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఆధారపడి కదలనున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2022–23)తోపాటు చివరి త్రైమాసిక(జనవరి–మార్చి) స్థూల దేశీయోత్పత్తి గణాంకాలను ప్రభుత్వం ఈ నెల 31న విడుదల చేయనుంది. పూర్తి ఏడాదికి ప్రొవిజనల్‌ గణాంకాలు వెల్లడికానున్నాయి. వీటికితోడు మే నెల ఆటో రంగ విక్రయాలు, తయారీ రంగ గణాంకాలు(పీఎంఐ) సైతం విడుదల కానున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ప్రధానంగా క్యూ4 జీడీపీ, ఆటో విక్రయాలపై దృష్టి పెట్టనునన్నట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు.  

ఫలితాల స్పీడ్‌
ఇప్పటికే గతేడాది క్యూ4(జనవరి–మార్చి) ఫలితాల సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ బాటలో వారాంతాన ఓఎన్‌జీసీ, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, పీటీసీ, అరబిందో ఫార్మా, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ క్యూ4 పనితీరు వెల్లడించాయి. ఈ బాటలో అదానీ ట్రాన్స్‌మిషన్, క్యాపంస్‌ యాక్టివ్‌వేర్, ఇప్కా ల్యాబొరేటరీస్, డీసీఎం, ఐఆర్‌సీటీసీ, జిందాల్‌ పాలీఫిల్మŠస్, జూబిలెంట్‌ ఫార్మోవా, నాట్కో ఫార్మా, ఎన్‌బీసీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌ఐఐటీ, రైల్‌ వికాస్‌ నిగమ్, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్‌ తదితరాలు క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి.  

ఇతర అంశాలు
తొలుత విడుదలైన రుతుపవన అంచనాల ప్రకారం ఈ ఏడాది సాధారణ వర్షపాతానికి వీలుంది. ఇకపై వెలువడనున్న రుతుపవన తాజా అంచనాలు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల తీరు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంట అంశాలు సైతం మార్కెట్లో ట్రెండ్‌ను నిర్దేశించగలవని విశ్లేషకులు వివరించారు. కాగా.. అమెరికా రుణ పరిమితి పెంపు అంశంపై ఈ వారం మరిన్ని చర్చలకు తెరలేవనుంది. గడువు ముగిసేలోగా ఇందుకు అనుమతి పొందాలని యూఎస్‌ ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. రుణ పరిమితి పెంపు 31.2 ట్రిలియన్‌ డాలర్లకు చేరవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

గత వారం ఇలా..
పలు ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు పటిష్ట లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 772 పాయింట్లు జమ చేసుకుని తిరిగి 62,000 పాయింట్ల ఎగువన 62,502కు చేరింది. నిఫ్టీ 296 పాయింట్లు ఎగసి 18,499 వద్ద స్థిరపడింది. ఈ బాటలో బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ మరింత అధికంగా 2.5 శాతం జంప్‌చేయగా.. స్మాల్‌ క్యాప్‌ 1.4 శాతం బలపడింది.

విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు
  రూ. 37,317 కోట్ల పెట్టుబడులు
కొద్ది రోజులుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌పట్ల ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ(మే 2–26) నికరంగా రూ. 37,317 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. ఇది గత ఆరు నెలల్లోనే అత్యధికంకాగా.. స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండటం, ఆకర్షణీయ స్థాయికి చేరిన షేర్ల ధరలు వంటి అంశాలు ఇందుకు కారణమవుతున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఇంతక్రితం ఎఫ్‌పీఐలు 2022 నవంబర్‌లో మాత్రమే ఈ స్థాయిలో రూ. 36,239 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. ఈ బాటలో 2023 ఏప్రిల్‌లో రూ. 11,630 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా.. మార్చిలో రూ. 7,936 కోట్ల విలువైన స్టాక్స్‌ సొంతం చేసుకున్నారు. అయితే 2023 జనవరి, ఫిబ్రవరిలలో ఎఫ్‌పీఐలు మొత్తం రూ. 34,000 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టడం గమనార్హం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement