న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర నష్టాలు తగ్గి రూ. 6,419 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది (2021–22) ఇదే కాలంలో రూ. 6,513 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 3 శాతం పుంజుకుని రూ. 10,507 కోట్లకు చేరింది.
కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం పెరిగి రూ. 29,298 కోట్లను తాకింది. 2021–22లో రూ. 28,234 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 38,490 కోట్ల నుంచి రూ. 42,134 కోట్లకు బలపడింది. క్యూ4లో వెచ్చించిన రూ. 560 కోట్లతో కలిపి గతేడాదిలో పెట్టుబడి వ్యయాలు రూ. 3,360 కోట్లకు చేరాయి. 2022 డిసెంబర్‌కల్లా రూ. 2,28,890 కోట్లుగా నమోదైన స్థూల రుణభారం మార్చికల్లా రూ.2,09,260 కోట్లకు తగ్గింది.
క్యూ4లో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ. 124 నుంచి బలపడి రూ. 135ను తాకింది. సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 7 శాతం తగ్గి 22.59 కోట్లకు చేరింది. కంపెనీలో ప్రభుత్వ వాటా 33.1 శాతంగా నమోదైంది. స్పెక్ట్రమ్ వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై వడ్డీని ఈక్విటీగా మార్పుచేసి ప్రభుత్వానికి జారీ చేయడంతో రుణ భారం తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది.
వొడాఫోన్ ఐడియా షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.7 శాతం బలపడి రూ. 7 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment