2023 : హైదరాబాద్‌లో కలిసొచ్చిన రియల్‌ ఎస్టేట్‌ రంగం | Sakshi
Sakshi News home page

2023 : హైదరాబాద్‌లో కలిసొచ్చిన రియల్‌ ఎస్టేట్‌ రంగం

Published Sat, Jan 6 2024 7:38 AM

Q4 2023 Saw Close To 200,000 Sf Of Main Street Leasing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 2023 నగర స్థిరాస్తి రంగానికి బాగానే కలిసొచ్చింది. నివాస, వాణిజ్య, కార్యాలయ విభాగాలతో పాటు రిటైల్‌ రంగం కూడా మెరుగైన పనితీరునే కనబర్చింది. షాపింగ్‌ మాల్స్‌లో రిటైల్‌ స్పేస్‌ క్రమంగా పెరుగుతుంది. గతేడాది నగరంలో 18 లక్షల రిటైల్‌ స్పేస్‌ లావాదేవీలు జరిగాయని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదిక వెల్లడించింది. 2023 ఆగస్టు–డిసెంబర్‌ చివరి త్రైమాసికంలో బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, సికింద్రాబాద్, కోకాపేట వంటి సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ (సీబీడీ) ప్రాంతాల్లో 2 లక్షల చ.అ. లావాదేవీలు జరిగాయని తెలిపింది. 

2023లో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో కొత్తగా 59.48 లక్షల చ.అ. విస్తీర్ణంలో 11 షాపింగ్‌ మాల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అదే 2022లో 34.49 లక్షల చ.అ. విస్తీర్ణంలో 8 మాల్స్‌ మార్కెట్‌లోకి వచ్చాయి. ఏడాది కాలంతో పోలిస్తే షాపింగ్‌ మాల్స్‌లో రిటైల్‌ స్పేస్‌ 72 శాతం మేర పెరిగింది. 

సిటీలో మూడు మాల్స్‌... 
గతేడాది అత్యధికంగా హైదరాబాద్‌లో మూడు మాల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. పుణే, చెన్నైలో రెండేసి, ముంబై, ఢిల్లీ, ఎన్‌సీఆర్, బెంగళూరు, అహ్మదాబాద్‌లో ఒక్కోటి చొప్పున అందుబాటులోకి వచ్చాయి. కోల్‌కతాలో ఒక్క మాల్‌ కార్యరూపంలోకి రాలేదు. 2023లో 15 లక్షల చ.అ. షాపింగ్‌ మాల్‌ స్పేస్‌ మార్కెట్‌లోకి రాగా.. ఈ ఏడాది నిర్మాణంలో ఉన్న మరో 20 లక్షల చ.అ. స్థలం అందుబాటులోకి రానుంది. నల్లగండ్ల, నానక్‌రాంగూడ, కొంపల్లి వంటి ప్రాంతాలలో కొత్త మాల్స్‌ నిర్మాణంలో ఉన్నాయి.

నల్లగండ్లలో అపర్ణా 
సంస్థ 7 లక్షల చ.అ. విస్తీర్ణంలో మాల్‌ అండ్‌ మల్టీఫ్లెక్స్‌ను నిర్మిస్తుంది. కూకట్‌పల్లిలో 16.60 లక్షల చ.అ. లేక్‌షోర్‌ మాల్స్‌ శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటున్నాయి.  

Advertisement
Advertisement