దూసుకెళ్తున్న క్విక్ కామర్స్ రంగం
2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు మార్కెట్
డాటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక
న్యూఢిల్లీ: సౌకర్యవంతంగా నిమిషాల వ్యవధిలోనే సరుకులను డెలివరీ చేసే సేవలకు ఆదరణ పెరుగుతుండటంతో సాంప్రదాయ కిరాణా దుకాణాల మార్కెట్ వాటాను క్విక్ కామర్స్ కంపెనీలు ఆక్రమిస్తున్నాయి. ఒక సర్వేలో పాల్గొన్న వినియోగదారుల్లో 46 శాతం మంది కిరాణా షాపుల నుంచి కొనుగోళ్లు గణనీయంగా తగ్గించుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో క్విక్ కామర్స్ మార్కెట్ పరిమాణం 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్లు సర్వే నిర్వహించిన డాటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ తమ నివేదికలో తెలిపింది.
2024లో ఈ మార్కెట్ 6.1 బిలియన్ డాలర్లుగా నమోదవుతుందని అంచనా. నివేదిక ప్రకారం ఈ ఏడాది కిరాణా అమ్మకాల్లో క్విక్ కామర్స్ మార్కెట్ దాదాపు 1.28 బిలియన్ డాలర్ల వాటాను దక్కించుకోనుంది. 2024 అక్టోబర్‌లో దేశీయంగా 10 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 3,000 మంది పాల్గొన్నారు. పరిశ్రమ వర్గాలు, నిపుణులు, కిరాణా దుకాణాల యజమానుల ఇంటర్వ్యూలు, బ్రోకరేజి సంస్థలు..మీడియా రిపోర్టుల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది.
సగటు ఆర్డరు రూ. 400..
ముందుగా ప్రణాళిక వేసుకోకుండా అప్పటికప్పుడు కొనుగోలు చేసే వారికి క్విక్ కామర్స్ మాధ్యమం సౌకర్యవంతంగా ఉంటోంది. నివేదిక ప్రకారం క్విక్ కామర్స్‌ను ఉపయోగించుకునే వినియోగదారుల సగటు ఆర్డరు విలువ సుమారు రూ. 400గా ఉంటోంది. ఆన్‌లైన్‌లో నిత్యావసరాలను షాపింగ్ చేసేవారిలో 75 శాతం మంది గత ఆరు నెలల్లో గణనీయంగా ఇలాంటి కొనుగోళ్లు చేశారు. 82 శాతం మంది వినియోగదారులు కిరాణా స్టోర్స్‌లో నిత్యావసరాల కొనుగోళ్లను పావు భాగం తగ్గించుకుని, దాన్ని క్విక్ కామర్స్ వైపు మళ్లించారు.
సాంప్రదాయ రిటైల్ విధానంలో వివిధ దశల్లో ఉండే మధ్యవర్తుల కమీషన్ల బాదరబందీ లేకపోవడంతో క్విక్ కామర్స్ సంస్థలు ఆకర్షణీయమైన ధరకే ఉత్పత్తులను అందిస్తుండటం సైతం కస్టమర్లు వాటివైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతోంది. ఈ నేపథ్యంలో నిత్యావసరాల మార్కెట్లో ఆధిపత్యం ఉన్న కిరాణా స్టోర్స్ మనుగడ కోసం పోరాడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ‘క్విక్ కామర్స్ వినియోగం అసాధారణ వేగంతో పెరిగింది. 2024లో ఇది 74% వృద్ధి నమో దు చేయనుంది. 2023–28 మధ్యలో 48% వార్షిక వృద్ధితో అత్యంత వేగంగా ఎదిగిన మాధ్యమంగా నిలవనుంది‘ అని నివేదిక పేర్కొంది.
క్విక్ కామర్స్ ‘కిక్’..
10–30 నిమిషాల్లో సరుకులను ఇంటి దగ్గరకే అందించే సర్వీసులను క్విక్ కామర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ విభాగంలో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ మొదలైనవి టాప్‌లో ఉన్నాయి. షాపింగ్ సౌలభ్యాన్ని కోరుకునే కస్టమర్లకు వేగవంతంగా, సౌకర్యవంతంగా సేవలు అందించడంపై క్విక్ కామర్స్ సంస్థలు ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. నిత్యావసరాల డెలివరీతో మొదలుపెట్టిన క్విక్ కామర్స్ సంస్థలు ప్రస్తుతం వివిధ ఉత్పత్తులకు విస్తరించాయి. ఎలక్ట్రానిక్స్, దుస్తులు, కాస్మెటిక్స్, గృహోపకరణాలు, ఔషధాలు, పెంపుడు జంతువులకు సంబంధించిన ఉత్పత్తులు, పుస్తకాలు మొదలైనవన్నీ కూడా అందిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment