వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా తాజాగా కార్పొరేట్‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్‌లు తమ సమయాన్ని 99 శాతం స్వప్రయోజనాల కోసమే కేటాయిస్తున్నారని, కానీ తమ లాంటి వారు అందరికీ మేలు చేసేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు.
పతంజలి ఆయుర్వేద సంస్థ సీఈవో, తన సహాయకుడు ఆచార్య బాలకృష్ణకు గోవాలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న రామ్‌దేవ్ బాబా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
‘నేను హరిద్వార్ నుంచి వచ్చి మూడు రోజులుగా ఇక్కడ ఉంటున్నాను. నా సమయం విలువ అదానీ, అంబానీ, టాటా, బిర్లాల కంటే ఎక్కువ. కార్పొరేట్లు తమ సమయాన్ని 99 శాతం స్వప్రయోజనాల కోసమే వెచ్చిస్తారు. కానీ మా లాంటివారు అలా కాదు’ అని రామ్‌దేవ్ బాబా పేర్కొన్నట్లు పీటీఐ వార్తా కథనం పేర్కొంది.
ఆచార్య బాలకృష్ణ తన నైపుణ్యంతో పతంజలి సంస్థకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.40 వేల కోట్ల టర్నోవర్ సాధించారని అభినందించారు. పతంజలి వంటి సంస్థలతో భారత్ పరమ వైభవశాలిగా మారుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment