ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఐబీఎస్ సాఫ్ట్‌వేర్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ వీకే మాథ్యూస్.. టాటాతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా వ్యక్తిత్వం గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర సంఘటలను పంచుకున్నారు.
రతన్ టాటా వ్యక్తిత్వంలో తనకు బాగా నచ్చేది ఆయన మానవత్వం అని, దీంతోపాటు ఆయనలో హాస్య చతురత కూడా ఉందని మాథ్యూస్ చెప్పారు. రతన్ టాటా ఉన్నారంటే ఎంతటి సీరియస్ వాతావరణాన్ని అయినా తన హాస్యంతో తేలికపరచగలరని పేర్కొన్నారు.
తానెవరో తెలియకుండా..
“యూఎస్ పర్యటనలో రతన్ టాటాతో కొంత సమయం గడిపే అవకాశం నాకు దొరికింది. ఆ సందర్భంగా జరిగిన రెండు సంఘటనలు నాకు ఎప్పుడూ గుర్తంటాయి” అని వాటి గురించి వెల్లడించారు మాథ్యూస్.
ఒక రోజు న్యూయార్క్‌లోని టాటా సొంత హోటల్‌లో వీరిద్దరూ అల్పాహారం చేశారు. అయితే రతన్ టాటా ఓనర్‌గా తన దర్పం ప్రదర్శించలేదని, అసలు తానెవరో అక్కడి సిబ్బందికి చెప్పలేదని మాథ్యూస్ గుర్తుచేసున్నారు. ఇదే ఆయన నిరాడంబరతకు నిదర్శనమని చెప్పారు.
“అదే రోజు తరువాత నేను, నా కుటుంబం మరొక రెస్టారెంట్‌కి వెళ్లగా అక్కడ రతన్ టాటా కనిపించారు. ఆయన బిల్లును స్వయంగా తన క్రెడిట్ కార్డ్‌తో చెల్లించడం చూసి ఆశ్చర్యానికి గురయ్యాను. అది ఆయన ఎంత సింపుల్‌గా ఉంటారో తెలియజేసింది” అని మాథ్యూస్ గుర్తుచేసున్నారు.
మరో కోణం
ఇక రతన్ టాటాలో ఉన్న మరో కోణం ఆయన హాస్య చతురత. "తన ట్రేడ్‌మార్క్ హాస్యంతో రతన్ టాటా నన్ను, 'నేను నిన్ను వెంటాడుతున్నానా, లేక నువ్వు నన్ను వెంటాడుతున్నావా?' అన్నారు. ఆ తేలికైన వ్యాఖ్య పరిస్థితితో సంబంధం లేకుండా ఇతరులతో కనెక్ట్ అయ్యే ఆయన స్వభావాన్ని తెలియజేసింది” అని మాథ్యూస్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment